CM Jagan: హెలికాప్టర్‌లో సీఎం.. రహదారిపై ఆంక్షలు

జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఆదివారం జరగనుంది.

Updated : 19 Mar 2023 09:42 IST

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2వరకూ వాహనాల మళ్లింపులు
జాతీయ రహదారిపై ఎనిమిది గంటలకు పైగా ట్రాఫిక్‌ మళ్లింపు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తిరువూరు: జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఆదివారం జరగనుంది. దీనికోసం సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి తిరువూరుకు చేరుకుంటారు.  పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి వస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం నుంచి ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. జగదల్‌పుర్‌ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎనిమిది గంటలు వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. నిత్యం జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలకు ఆదివారం అవస్థలు తప్పవు.

మైలవరం వైపు నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను చీమలపాడు సెంటర్‌ మీదుగా గంపలగూడెం, కల్లూరు వైపు, మైలవరం నుంచి భద్రాచలం వెళ్లే వాహనాలను ఎ.కొండూరు అడ్డరోడ్డు నుంచి విస్సన్నపేట మీదుగా సత్తుపల్లి వైపు, భద్రాచలం నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను కల్లూరు, చీమలపాడు వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల అరగంటలో తిరువూరు దాటి వెళ్లే వాహనదారులు చుట్టూ తిరిగి రెండు గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. అవగాహన ఉంటే.. మళ్లించిన మార్గంలో వెళ్లగలరు. కొత్తవారైతే ఈ మార్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రోడ్డు మార్గంలో అరగంటకు మించి లేదు

తిరువూరు బైపాస్‌ రోడ్డులోని శ్రీఅయ్యప్పస్వామి ఆలయం పక్కన ఖాళీ ప్రదేశంలో ముఖ్యమంత్రి సభా వేదికను ఏర్పాటుచేశారు. తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరువూరు వాహినీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్దకు ఉదయం 10.35కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి సుగాలి కాలనీ, ఎంపీడీవో కార్యాలయం వీధి, పట్టణ ప్రధాన రహదారి మీదుగా 15 నిమిషాల్లోనే రోడ్డుమార్గంలో సభా స్థలికి చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి మధ్యాహ్నం 12.30కు బయలుదేరి పది నిమిషాల్లో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. మొత్తం పర్యటనలో.. జాతీయ రహదారిపై ప్రయాణం అరగంటకు మించి లేదు. ఆ సమయంలో లక్ష్మీపురం, ముత్తగూడెం చెక్‌పోస్టు వద్ద కొద్దిసేపు వాహనాలను నిలిపితే సరిపోతుంది. అధికారులు అత్యుత్సాహంతో వాహనదారులను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మళ్లింపుల పేరుతో ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రణాళికలు రూపొందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని