Andhra News: విద్యార్థులను లాకప్‌లో పెట్టిన ఘటనపై సుమోటోగా కేసు

బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించినా శిక్షార్హులవుతారని ఏపీ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ సభ్యుడు జె.రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు.

Updated : 19 Mar 2023 09:48 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించినా శిక్షార్హులవుతారని ఏపీ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ సభ్యుడు జె.రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు. ‘కౌన్సెలింగ్‌ పేరిట లాకప్‌లో విద్యార్థులు’ శీర్షికన ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడం ప్రాథమికంగా తప్పంటూ సంబంధిత ఉపాధ్యాయులను మందలించారు. దీనిపై కమిటీని నియమించి విచారణ చేయిస్తామని చెప్పారు. డీఈవో, కలెక్టర్‌తోనూ మాట్ల్లాడతానన్నారు. ముగ్గురు బాధితులను విచారణకు పిలవగా వారిలో ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాలేదన్నారు. దీంతో ఒకరినే విచారించామని చెప్పారు. బాలల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయమై ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు జగ్గారావుకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో రాజేంద్రప్రసాద్‌ సమావేశమయ్యారు. 

ఉపాధ్యాయులకు తాఖీదులు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులను పోలీస్‌స్టేషన్లో పెట్టించిన ఘటనలో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు తాఖీదులు జారీచేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడమే కాకుండా పోలీసుస్టేషన్లో అప్పగించిన సంగతి విదితమే. ఇలా ఎందుకు చేశారో కారణాలు తెలపాలంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.జగ్గారావు, ఉపాధ్యాయులు విజయ్‌ప్రకాశ్‌, గణపతి, సీహెచ్‌ సుధాకర్‌రెడ్డికి ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి డీఎస్‌ఈవో ఎన్‌వీ రవిసాగర్‌ శనివారం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని