చెల్లెలి మరణంతో ఆగిన అక్క గుండె: మూడు నిమిషాల వ్యవధిలో ఇద్దరూ మృతి

ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తమ తమ కుటుంబాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

Updated : 19 Mar 2023 08:50 IST

శ్రీకాకుళం జిల్లాలో ఘటన

కొత్తూరు, న్యూస్‌టుడే: ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తమ తమ కుటుంబాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరి మధ్యా ఉన్న ఈ బంధాన్ని మృత్యువు సైతం విడదీయలేకపోయింది. చెల్లెలి ఊపిరి ఆగిన మూడు నిమిషాల వ్యవధిలోనే అక్క తన ప్రాణం వదిలేసింది. కళ్లు చెమర్చే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప గ్రామంలో శనివారం చోటుచేసుకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేన్సర్‌తో బాధపడుతున్న మామిడి సన్యాసమ్మ (50) వనపలో తమ ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. ఆమదాలవలస మండలం వంజంగిలో ఉండే ఆమె అక్క గురుగుబెల్లి అనసూయమ్మ (55).. తరచూ చెల్లెలి వద్దకు వచ్చి సపర్యలు చేస్తూ ఉండేవారు. ఇదే క్రమంలో చెల్లెలికి నలతగా ఉందని తెలియడంతో భర్తతో కలిసి శుక్రవారం వనపకు చేరుకున్నారు. శనివారం ఉదయం ఇద్దరూ కలిసి అల్పాహారం తీసుకుని కబుర్లు చెప్పుకొన్నారు. అంతలోనే సన్యాసమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు సపర్యలు చేసినప్పటికీ కొంతసేపటికి ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనసూయమ్మ.. గుండెపోటుకు గురై మూడు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు