ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు

ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 7,16,664 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 19 Mar 2023 04:10 IST

పట్టభద్రులవి 7.37 శాతం
ఉపాధ్యాయులవి 2.10 శాతం
అవగాహన లేమి.. పొరపాట్లే కారణం

ఈనాడు, అమరావతి: ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 7,16,664 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 52,882 మంది ఓట్లు చెల్లలేదు. పోలైన ఓట్లలో ఇది 7.37 శాతం. తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో 50,626 ఓట్లు పోలవ్వగా 1,064 చెల్లనవిగా తేలాయి. పోలైన ఓట్లలో ఇది 2.10 శాతం. ఈ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లంతా  విద్యావంతులే, చాలామంది పాత ఓటర్లే. అయినా ఓటింగ్‌ విధానంపై అవగాహన లేక కొందరు, పొరపాటు పడి మరికొందరు సరిగ్గా ఓటేయకపోవడంతో అవి చెల్లలేదు.

దొంగ ఓట్ల ప్రభావమూ...

నిరక్షరాస్యులు, 6, 7, 8, 10 తరగతులు చదివిన వారినీ పట్టభద్రులుగా పేర్కొంటూ పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను చేర్చారు. పోలింగ్‌ రోజున వీరంతా ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో చాలామందికి ఓటు ఎలా వేయాలో తెలియదు. వారికి తోచినట్లు ఓటేశారు. చెల్లని ఓట్ల సంఖ్య అధికంగా ఉండటానికి ఇదీ కారణమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ సాధారణ ఎన్నికల కంటే భిన్నం. నచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఓట్లు వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో.... ఆ అభ్యర్థి పేరు ఎదురుగా 1 నంబరు, రెండో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారి పేరు ఎదురుగా 2 నంబరు వేయాలి. చాలామంది అభ్యర్థి పేరు ఎదురుగా నంబరు వేయటానికి బదులు.. ఆ పేరుపై రైట్‌ మార్క్‌ పెట్టడం, సంతకం చేయటం, ఒకటి అని అక్షరాల్లో రాయటం, అభ్యర్థి పేరుకు రౌండ్‌ చుట్టడం, ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులకు 1 నంబరు ప్రాధాన్యత ఓటు వేయటంతో అవన్నీ చెల్లకుండా పోయాయి.


భాజపా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే...

* పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి 3 చోట్లా భాజపా అభ్యర్థులకు పడ్డ ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి భాజపా అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు 11,270 ఓట్లు లభించాయి. ఇక్కడ చెల్లని ఓట్లు 12,795.

* తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి భాజపా అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డికి 6,314 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో చెల్లని ఓట్లు 20,979. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి భాజపా అభ్యర్థి రాఘవేంద్ర నగరూరుకు 7,494 ఓట్లు లభించాయి. ఇక్కడ చెల్లని ఓట్లు 19,108.


గెలిచిన అభ్యర్థులు సాధించిన ఆధిక్యాల కంటే...

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వైకాపా మద్దతుదారు ఎంవీ రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ఒంటేరు శ్రీనివాసులురెడ్డికి 10,618 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య 169 ఓట్లే తేడా. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 608 చెల్లలేదు. విజయం సాధించిన అభ్యర్థి సాధించిన ఆధిక్యత కంటే చెల్లని ఓట్లే అధికం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని