28న నిర్వహించాల్సిన పరీక్ష 18నే

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగుచూసింది.

Published : 19 Mar 2023 05:13 IST

ఎస్వీయూ పరిధిలోని  పలు కళాశాలల నిర్లక్ష్యం

తిరుపతి(ఎస్వీయూ), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగుచూసింది. బీఏ, బీకాం విద్యార్థులకు ‘ఫండమెంటల్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌’ పేపరు కామన్‌గా ఉంటుంది. ఎస్వీయూ పరీక్షల కార్యాలయం ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షను మార్చి 16, 18, 20 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. బీఏ, బీకాం రెగ్యులర్‌, సప్లిమెంటరీ విద్యార్థులకు ఒకే సిలబస్‌తో కూడిన ప్రశ్నపత్రం అయినందున పరీక్షను కామన్‌గా ఒకేరోజు నిర్వహించాలన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్‌ను ఎస్వీయూ పరీక్షల కార్యాలయం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఎస్వీయూ ఓ సర్క్యులర్‌ను వెలువరిస్తూ.. మార్చి 16, 18, 20 తేదీల్లో జరగాల్సిన ఫండమెంటల్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ పరీక్షలను ఈ నెల 28న బీఏ, బీకాం విద్యార్థులకు ఒకేరోజు నిర్వహిస్తామని స్పష్టంగా పేర్కొంటూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు సర్క్యులర్‌ను పంపింది.

ముందే రాయించేశారు...

ఎస్వీయూ పంపిన సర్క్యులర్‌ను సరిగా చూడని కారణంగా... తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి(ఎస్‌జీఎస్‌) కళాశాల పరీక్ష కేంద్రంలో సంబంధిత పరీక్షను శనివారమే నిర్వహించారు. ఆఖర్లో పొరపాటును గుర్తించి, ఎస్వీయూకు సమాచారమిచ్చారు. ఎస్‌జీఎస్‌ కళాశాలలో మాదిరిగానే చదలవాడ కళాశాల, ఏఈఆర్‌ ప్రైవేటు కళాశాలల్లోనూ పరీక్షను నిర్వహించారు. కళాశాలల నిర్లక్ష్యం వల్ల ప్రశ్నపత్రాన్ని మళ్లీ రూపొందించి ముద్రించాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. ఈ అంశంపై ఎస్వీయూ వీసీ ఆచార్య రాజారెడ్డి శనివారం రాత్రి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు