కొత్త వైద్య కళాశాలల్లో లోపాలపై సంజాయిషీ నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అయిదు వైద్య కళాశాలల్లోని నాలుగింట్లో మార్గదర్శకాల ప్రకారం భవన నిర్మాణాలు, సౌకర్యాలు లేకపోవడంపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వైద్య, ఆరోగ్య శాఖను సంజాయిషీ కోరింది.

Published : 19 Mar 2023 05:13 IST

మలి విడత తనిఖీల నాటికి సరిచేస్తాం
అనుమతులివ్వాలని ఎన్‌ఎంసీకి వైద్య, ఆరోగ్య శాఖ అభ్యర్థన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అయిదు వైద్య కళాశాలల్లోని నాలుగింట్లో మార్గదర్శకాల ప్రకారం భవన నిర్మాణాలు, సౌకర్యాలు లేకపోవడంపై జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వైద్య, ఆరోగ్య శాఖను సంజాయిషీ కోరింది. విజయనగరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాలల్లో 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌లో తరగతుల ప్రారంభానికి అనుమతివ్వాలని  రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఎన్‌ఎంసీ బృందాలు కొద్దికాలం కిందట ఈ 5 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాయి. అనంతరం విజయనగరం కళాశాలలో మాత్రమే తరగతుల ప్రారంభానికి ఎన్‌ఎంసీ అనుమతినిచ్చింది. ‘మిగిలిన కళాశాలల్లో నిర్మాణాలు, సౌకర్యాలు.. తరగతుల ప్రారంభానికి తగ్గట్లు లేవు. 2023-24 విద్యా సంవత్సరంలో తరగతుల ప్రారంభానికి తగ్గట్లు చర్యలు తీసుకోగలరా? లేదా? మీ విజ్ఞప్తిని ఎందుకు తిరస్కరించకూడదు’ అని సంజాయిషీ నోటీసులు పంపింది. దీంతో ఉన్నతాధికారులు రెండు రోజుల కిందట దిల్లీలో ఎన్‌ఎంసీ అధికారులను కలిసి ఆ లోపాలను సరిదిద్దుతున్నామని చెప్పారు. వచ్చే నెలాఖరులోగా కళాశాలల్లో మలి విడత తనిఖీకి ఎన్‌ఎంసీ బృందాలు రావొచ్చని భావిస్తున్నారు. నీట్‌ ఫలితాల వెల్లడి నాటికి ఈ కళాశాలల్లో ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు చర్యలు తీసుకుంటారని నమ్మకం కుదిరితేనే ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభానికి అనుమతులు లభిస్తాయి.

నియామకాలకు కనిపించని స్పందన

రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం వైద్య కళాశాలల్లో సీనియర్‌ రెసిడెంట్స్‌ నియామకాలకు శనివారం వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరిగాయి. విజయనగరంలో మాత్రమే అభ్యర్థుల నుంచి కాస్త స్పందన కనిపించింది. మిగతాచోట్ల స్పందన బాగా తక్కువగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు