ఆంక్షలతో అవస్థలు.. విపక్ష నాయకుల గృహ నిర్బంధాలు

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనను పురస్కరించుకొని ఎప్పటిలాగే పోలీసులు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని పలువురు ప్రతిపక్ష నాయకులను నిర్బంధంలోకి తీసుకున్నారు.

Updated : 20 Mar 2023 05:27 IST

తిరువూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనను పురస్కరించుకొని ఎప్పటిలాగే పోలీసులు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని పలువురు ప్రతిపక్ష నాయకులను నిర్బంధంలోకి తీసుకున్నారు. కొందరిని అర్ధరాత్రి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించగా, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. తిరువూరు నియోజకవర్గంలో అభివృద్ధి విస్మరించినందుకు నిరసన వ్యక్తం చేస్తూ తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య శనివారం రాత్రి తిరువూరులో ‘గో బ్యాక్‌ సీఎం’ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడులోని మునియ్య ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అతని వద్ద నుంచి సెల్‌ ఫోన్లు లాక్కున్నారు. సీఎం సభ ముగిసిన తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఎ.కొండూరు, తిరువూరు, విస్సన్నపేట మండలాలకు చెందిన సీపీఐ, సీపీఎం నాయకులను అర్ధరాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు.

వైకాపా వారిని సైతం..: మరోవైపు ఎమ్మెల్యే రక్షణనిధి వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారనే కారణంతో విస్సన్నపేటకు చెందిన వైకాపా నాయకుడు కోపల్లి జయకర్‌బాబును కూడా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తనను అరెస్టు చేయలేదని, తమ ప్రభుత్వంలో ఇలా జరగడం హ్యాట్సాఫ్‌ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నుంచి సస్పెన్షన్‌కు గురైన గంపలగూడేనికి చెందిన జి.నాగరాజును శనివారం రాత్రి నుంచి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తిరువూరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సీఎం సభలో కరపత్రాలు పంపిణీ చేస్తాడనే సమాచారంతో అతనిని గృహ నిర్బంధం చేసినట్లు తెలిసింది.

సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన విద్యార్థులు, ప్రజలు

సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగానే విద్యార్థులు, ప్రజలు వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు, నియోజకవర్గం నలుమూలల నుంచి జనాన్ని ఉదయం 9 గంటలకే సభావేదిక వద్దకు బస్సుల్లో తీసుకు వచ్చారు. ఆదివారం ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారు ఉక్కపోతకు అల్లాడిపోయారు. సభావేదిక వరకే టెంటు వేయడంతో ఆరుబయట గంటల తరబడి మండుటెండలో నిరీక్షించిన ప్రజలు తట్టుకోలేక సీఎం మాట్లాడుతుండగానే వెనుదిరిగారు. సభావేదిక లోపల ఉన్న విద్యార్థులను ఐదు గంటల పాటు పోలీసులు బయటకు రానివ్వలేదు.

ట్రాఫిక్‌ ఆంక్షలతో అవస్థలు

ముఖ్యమంత్రి జగన్‌ తిరువూరుకు హెలికాప్టర్‌లో వచ్చారు. అయితే ఇక్కడ విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలతో  వాహన చోదకులకు నరకం కనిపించింది.


సీఎం సభకు విద్యార్థుల తరలింపు

నూజివీడు, న్యూస్‌టుడే: తిరువూరులో సీఎం సభకు 50 కిలోమీటర్ల దూరంలోని నూజివీడు ప్రాంత విద్యా సంస్థల విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో తరలించారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన 2,738 మంది విద్యార్థులను అల్పాహారం అనంతరం 61 బస్సుల్లో తీసుకెళ్లారు. వారంతా సాయంత్రం సుమారు 6 గంటలకు తిరిగి ట్రిపుల్‌ఐటీకి చేరుకున్నారు. దీనిపై కొందరు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని