గుండె చెదిరిన రైతు.. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం

రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతలు రూ.లక్షల్లో నష్టపోయారు. కండె దశలో ఉన్న మొక్కజొన్న ఈదురుగాలుల ధాటికి నేల కరచింది. మామిడి పూత, పిందె రాలిపోతోంది.

Updated : 20 Mar 2023 05:25 IST

పిడుగుపాటుకు ఒకరి మృతి

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతలు రూ.లక్షల్లో నష్టపోయారు. కండె దశలో ఉన్న మొక్కజొన్న ఈదురుగాలుల ధాటికి నేల కరచింది. మామిడి పూత, పిందె రాలిపోతోంది. బొప్పాయి, మునగ చెట్ల మొదళ్లే మిగిలాయి. అరటి చెట్లు సగానికి విరిగిపడ్డాయి. వడగళ్లతో టమోటా, మిరప ఇతర పంటలకూ నష్టం వాటిల్లింది. అయినా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పొలాల్లోకి రావడం లేదని, నష్ట తీవ్రతను కూడా తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన అనంతపురం జిల్లా వెంకటాంపల్లి, నార్పల తదితర మండలాల రైతులు ఆదివారం తాడిపత్రి రహదారిని దిగ్బంధించి ఆందోళనకు దిగారు.

మహిళా రైతు ఆత్మహత్య

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3లక్షల ఎకరాలకు పైగా పంటనష్టం జరిగినట్లు అంచనా. బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఏదుబాడులో పొగాకు పంట తడిసిపోవడంతో.. మహిళా రైతు నిర్మల(48) ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం ఎదురుపట్టు గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై పాడిరైతు నాగముంతల రమణయ్య (46) మృతిచెందారు.

* తిరుపతి జిల్లా నాయుడుపేటలో వరి పనలు నీట మునిగాయి. ఒక్క పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 10వేల ఎకరాల వరకు వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా. చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు టమోటా, కాకర, కర్బూజా, మామిడి తదితర పంటలు నష్టపోయారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కుమ్మరకొండూరు, సిద్దన కొండూరు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 120 విద్యుత్తు స్తంభాలు, 30 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం గొర్లలో కాలనీ నీట మునిగింది.

నేడు, రేపు వర్షాలు

కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. 

 

పంటనష్టం గణన ప్రారంభించండి: సీఎం

పంట నష్టంపై వెంటనే గణన ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాలవర్షాలపై ఆయన ఆదివారం అధికారులతో సమీక్షించారు. వారం రోజుల్లో పంటనష్టం గణన పూర్తి చేయాలని, రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతుల్ని ఆదుకోవాలి: చంద్రబాబు

అకాల వర్షాలు, గాలివాన బీభత్సంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

* నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి ప్రాంతంలో తడిసిన మినుము ఓదెలను ఆయన పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని