ఇంటి భారం ఇంతింత కాదయా!

అమ్మ.. ఇంటిపని భారంతో రోజూ ఎన్ని గంటలు శ్రమిస్తుందో తెలియదు. ఆమెకు పని ఒత్తిడి మరింత పెరగనుందని తాజా అధ్యయనంలో తేలింది.

Updated : 20 Mar 2023 08:36 IST

గృహిణిపై ఆధారపడే జనాభా పెరగనుంది..
2036 నాటికి మరో 4.63 కోట్లు అదనం..
10 కోట్లు అధికం కానున్న ‘పనిచేసే జనాభా’
కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ అంచనా

అమ్మ.. ఇంటిపని భారంతో రోజూ ఎన్ని గంటలు శ్రమిస్తుందో తెలియదు. ఆమెకు పని ఒత్తిడి మరింత పెరగనుందని తాజా అధ్యయనంలో తేలింది. 2036 నాటికి దేశ జనాభా పెరుగుదల అంచనాలతో ‘భారతదేశంలో మహిళలు-పురుషులు-2022’ నివేదికను కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసింది. మారుతున్న సామాజిక పరిస్థితులు, జనాభా పెరుగుదల తీరును ఇందులో వివరించింది.

* భారతదేశ జనాభా 2021లో 136 కోట్లుంటే 2036 నాటికి 152 కోట్లు దాటనుందని అంచనా. ‘పనిచేసి ఉపాధి పొందే వయసు’ (వర్కింగ్‌ ఏజ్‌) జనాభా ప్రస్తుతం 88 కోట్లుండగా 2036 నాటికి 98.85 కోట్లకు పెరుగుతుంది. అప్పటికి దేశంలో 14 ఏళ్లలోపు బాలలు 30.64 కోట్లు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు 22.74 కోట్ల మంది ఉంటారని అంచనా.

* భారతీయ కుటుంబ సంప్రదాయం ప్రకారం.. ఇంట్లో 14 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధుల బాగోగులను ఎక్కువగా గృహిణులే చూసుకుంటారని ఈ నివేదిక తెలిపింది. ఇలా ఆధారపడి జీవించే బాలలు, వృద్ధుల జనాభా శాతాన్ని డిపెండెన్సీ రేషియో అని పిలుస్తారు. ఈ జనాభా 2021లో 48.75 కోట్లుంటే.. 2036 నాటికి 53.38 కోట్లకు పెరుగుతుంది. అంటే గృహిణులు సేవలందించాల్సిన వారి సంఖ్య మరో 4.63 కోట్లు పెరుగుతుంది. కానీ ఇలా సేవలందిస్తున్న గృహిణులు ఇప్పుడెంతమంది ఉన్నారు.. 2036 నాటికి వీరి సంఖ్య ఎంత పెరుగుతుందనే గణాంకాలను విడిగా ఇవ్వలేదు.


పిల్లలు తగ్గి.. వృద్ధులు పెరిగి..

14 ఏళ్లలోపు బాలల సంఖ్య 2011లో 37.38 కోట్లు ఉండగా.. 2036 నాటికి 30.63 కోట్లకు తగ్గిపోనుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధుల జనాభా 10.15 కోట్ల నుంచి 22.74 కోట్లకు పెరుగుతుంది. వృద్ధుల జనాభా ఏకంగా 124 శాతం పెరగనుండగా బాలల జనాభా 18 శాతం పడిపోనుంది. జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, యువత త్వరగా పెళ్లిళ్లు చేసుకోకపోవడం వంటివి ఈ పరిస్థితులకు కారణాలని అంచనా.


రికార్డు స్థాయికి లింగ నిష్పత్తి

దేశంలో 1951 నాటికి వెయ్యి మంది బాలురకు 965 మంది బాలికలుండగా 1991లో బాలికల నిష్పత్తి అత్యల్పంగా 938కి పడిపోయి.. 2021లో 958కి పెరిగింది. ఇది 2036 నాటికి 969కి చేరవచ్చని అంచనా. దేశ లింగనిష్పత్తి చరిత్రలో అదే అత్యధికమవుతుంది. కానీ రాబోయే 15 ఏళ్ల తరువాత కూడా బాలికల సంఖ్య బాలురను మించే అవకాశాల్లేవు.


ఊబకాయులు మరింతగా..

* పెరుగుతున్న వైద్యసౌకర్యాల కారణంగా భారతీయుల సగటు జీవితకాలం 2031-36 మధ్య పురుషులకు 71.2, మహిళలకు 74.7 సంవత్సరాలుంటుందని అంచనా.

* జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో దేశంలోని పురుషుల్లో 18.9 శాతం ఊబకాయులుంటే 2019-21కల్లా అది 22.9 శాతానికి పెరిగింది. మహిళల శాతం 20.6 నుంచి 24కి చేరింది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని