ప్రసంగాన్ని మార్చిన ధైర్యం రామమోహనరావుది

రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేసి.. అసెంబ్లీలో చదివిన ధైర్యం తమిళనాడు మాజీ గవర్నరు పీఎస్‌ రామమోహనరావుదని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రశంసించారు.

Updated : 20 Mar 2023 05:54 IST

మాజీ గవర్నరుపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ప్రశంస
అన్ని స్థానాల్లో మోదీలాంటి నిజాయతీపరులుండాలి
వెంకయ్య నాయుడి వ్యాఖ్య
రామమోహనరావు పుస్తకావిష్కరణ

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేసి.. అసెంబ్లీలో చదివిన ధైర్యం తమిళనాడు మాజీ గవర్నరు పీఎస్‌ రామమోహనరావుదని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రశంసించారు. ‘ఆయన, నేను బలమైన మహిళా ముఖ్యమంత్రులున్న సమయంలో (తమిళనాడుకు జయలలిత; పశ్చిమ బెంగాల్‌కు మమతా బెనర్జీ) రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశాం. ఆర్టికల్‌ 176 కింద అసెంబ్లీని ఉద్దేశించి గవర్నరు ప్రసంగించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదిస్తే అది చదవాలి. కానీ రామమోహనరావు ప్రభుత్వం పంపిన ప్రసంగంలో మార్పులు చేయొచ్చా అని సీఎంకు లేఖ రాసి ఆమె అనుమతి తీసుకుని మరీ మార్పులు చేశారు’ అని పేర్కొన్నారు. ‘గవర్నర్‌పేట టు గవర్నర్స్‌ హౌస్‌- ఎ హిక్స్‌ ఒడిస్సీ’ పేరుతో రామమోహనరావు రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, హరియాణా గవర్నరు దత్తాత్రేయలతో కలిసి ఆదివారం దిల్లీలో ధన్‌ఖడ్‌ విడుదల చేశారు.

ఆత్మకథ రాయను: వెంకయ్య నాయుడు

తనను ఎందరో ఆత్మకథ రాయాలని అడిగారని, అది ఎంతోమందిని బాధించే అవకాశం ఉన్నందున రాయకూడదని నిర్ణయించుకున్నానని మాజీఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అనుభవాలనైనా చెప్పాలని, పుస్తకాలు రాసుకుంటామని సన్నిహితులు కోరడంతో అంగీకరించానన్నారు. ప్రభుత్వంలోని అన్నిస్థానాల్లో మోదీలాంటి నిజాయతీపరులుండాలని ఆకాంక్షించారు. ఎంపీ కె.కేశవరావు, సుజనా చౌదరి, మర్రి శశిధర్‌రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కామినేని శ్రీనివాస్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి కార్తికేయన్‌ పాల్గొన్నారు.


ఎన్టీఆర్‌ ఎమ్మెల్యేల ప్రదర్శన సలహా నాదే: రామమోహనరావు

దేశంలో కాంగ్రెస్‌ బలాన్ని తగ్గించి, మిగతా రాజకీయ పార్టీలు ఎదిగేలా చేసింది ఎన్టీఆరేనని పుస్తక రచయిత పీఎస్‌ రామమోహనరావు వెల్లడించారు. ‘1970ల చివరి నుంచి 80ల మొదటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక ముఖ్యమంత్రులను చూసింది. అది కాంగ్రెస్‌ నాయకత్వానికి అప్రతిష్ఠ తీసుకురావడమే కాకుండా ఎన్టీ రామారావు ప్రభంజనానికి కారణమైంది. ఎన్టీఆర్‌తో నేను చాలాకాలం పని చేశాను. ఆయన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరిగినప్పుడు గతంలో ఎన్నడూలేని విధంగా గవర్నరు ముందు ఎమ్మెల్యేల ప్రదర్శన నిర్వహించాలని సూచించింది నేనే. అది ఆయనను రాజకీయంగా తెరమరుగు కాకుండా చేసింది. నేను ఏపీ పోలీసు వ్యవస్థకు నేతృత్వం వహించినప్పుడు గ్రేహౌండ్స్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని