గృహ నిర్బంధాలు.. ముందస్తు నోటీసు

ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసేలా ఉన్న జీవో నంబర్‌-1ను రద్దు చేయాలన్న డిమాండుతో సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆదివారం సాయంత్రం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.

Published : 20 Mar 2023 04:38 IST

జీవో-1 రద్దు చేయాలంటూ చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన ఐక్య వేదిక
ముఖ్య నాయకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈనాడు, అమరావతి: ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసేలా ఉన్న జీవో నంబర్‌-1ను రద్దు చేయాలన్న డిమాండుతో సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆదివారం సాయంత్రం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. వారికి ముందస్తు నోటీసులు జారీ చేసి ఇల్లు కదలకుండా అడ్డుకున్నారు. జీవో-1 రద్దు పోరాట ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావును రాజమహేంద్రవరం పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని రాజానగరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నాయకులు కూన రవికుమార్‌, గుండ లక్ష్మీదేవికి.. చలో అసెంబ్లీకి వెళ్లొద్దని నోటీసులు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో వామపక్షాల నేతల్ని, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని పలువురికి నోటీసులిచ్చారు. విజయవాడ, గుంటూరు పరిధిలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముప్పాళ్ల సుబ్బారావు, పలువురు వామపక్ష నాయకుల్ని అదుపులోకి తీసుకోవటాన్ని, గృహనిర్బంధం చేయటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండు చేశారు. మరోవైపు అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ ఆ సంఘం కూడా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ నాయకుల్ని కూడా జిల్లాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని