సంక్షిప్త వార్తలు (11)

రైతులు సులువుగా దున్నేలా పోర్టబుల్‌ కల్టివేషన్‌ మిషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన అకడమిక్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

Updated : 21 Mar 2023 06:10 IST

ఈ హలం వినూత్నం...

రైతులు సులువుగా దున్నేలా పోర్టబుల్‌ కల్టివేషన్‌ మిషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన అకడమిక్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం, కలుపు తీయడం మందు చల్లడం ఏకకాలంలో చేసేలా ఈ పరికరాన్ని రూపొందించారు. నేల గట్టిగా ఉన్న ప్రాంతంలో సబ్‌మెర్సిబుల్‌ పంపు ద్వారా నీరు విడుదల కావడంతో అవలీలగా భూమి దున్నేయొచ్చు. రైతుకు ఉపకారిగా రూ.3 వేలలోపు ఖర్చుతో ఈ హలాన్ని తీర్చిదిద్దామని ఏఎన్‌యూ బీటెక్‌ మెకానికల్‌ విద్యార్థులు వంశీవర్ధన్‌, నవీన్‌,  సాయిమహేష్‌ తెలిపారు.

 ఈనాడు గుంటూరు


ఇక ఇంటి నుంచే ఆర్టీసీ కార్గో సేవలు పొందొచ్చు

లాంఛనంగా ప్రారంభించిన రవాణా మంత్రి విశ్వరూప్‌

ఈనాడు-అమరావతి: సరకు రవాణాలో కొత్త సేవలకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఇళ్ల నుంచే పార్శిళ్లు బుక్‌ చేసుకునే వీలు కల్పించనుంది. ఈ సౌకర్యాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ సోమవారం ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలసి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వినియోగదారుల ఇళ్ల నుంచి పార్శిళ్లను తీసుకెళ్లే సౌకర్యానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇది ఉగాది సందర్భంగా ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనే కొత్త సేవలను ప్రారంభిస్తున్నారు. తర్వాత దశల వారీగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నారు. ప్రారంభ కానుకగా వినియోగదారుడికి తొలి మూడు బుకింగ్స్‌లో పికప్‌, డ్రాప్‌లు ఉచితమని నిర్ణయించారు. బుకింగ్‌ కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్లలోకి వెళ్లి.. అక్కడి నుంచి షిప్‌మంత్ర ద్వారా కానీ, నేరుగా షిప్‌మంత్ర సైట్‌ నుంచి కానీ బుక్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే వీలుంది.


ఎన్టీఆర్‌ రూ.100 నాణెం విడుదలపై నోటిఫికేషన్‌ జారీ  

ఈనాడు, దిల్లీ: విఖ్యాత సినీనటులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థికశాఖ ఆ మేరకు సోమవారం అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. 44 మి.మీ. చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌ లోహాలు ఉంటాయని తెలిపింది. ఈ నాణేనికి ఒక వైపు మూడు సింహాలతో కూడిన అశోకచక్రం ఉంటుంది. మరోవైపు ఎన్టీఆర్‌ చిత్రం, దానికింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి వత్సరం అని హిందీ, ఇంగ్లిషుల్లో 1923-2023 అని ముద్రిస్తారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు ఉండనుంది.


కానిస్టేబుల్‌ను అభినందించిన డీజీపీ

ఈనాడు, అమరావతి: గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువతిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ అంగాని వీరబాబును డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి అభినందించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయనకు నగదు పురస్కారం అందించారు. ప్రధానమంత్రి జీవన్‌రక్షా పతకం కోసం వీరబాబు పేరును సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు.


నాడు-నేడు పాఠశాలల్లో రాత్రి కాపలాదారులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ‘నాడు-నేడు’ పూర్తి చేసిన 5,388 పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మెన్‌ (రాత్రి కాపలాదారు)లను నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మరుగుదొడ్ల నిర్వహణ నిధుల నుంచి ఒక్కొక్కరికి గౌరవవేతనం రూ.6వేల చొప్పున ఇస్తారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా వీరిని నియమిస్తారు. ఇప్పటికే పని చేస్తున్న ఆయా భర్త, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ప్రాధాన్యమిస్తారు.


కొత్తగా మూడు పాలిటెక్నిక్‌ కళాశాలలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మూడు పాలిటెక్నిక్‌ కళాశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్‌, వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరుల్లో ఏర్పాటుకు పరిపాలన అనుమతిచ్చింది.


నిరసన తెలియజేసే హక్కును కాలరాశారు

పోలీసుల చర్యను ఖండించిన ఐలు

ఈనాడు, అమరావతి: జీవో 1కి వ్యతిరేకంగా శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చిన న్యాయవాదులను పోలీసులు అక్రమంగా అరెస్టు, గృహనిర్బంధం చేయడాన్ని ఐలు (అఖిలభారత న్యాయవాదుల సంఘం) రాష్ట్రకమిటీ ఖండించింది. స్వేచ్ఛగా సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అడ్డుగా ఉన్న జీవో1ను రద్దుచేయాలని డిమాండ్‌ చేసింది. ఐలు రాష్ట్ర ప్రధానకార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, ఏపీ హైకోర్టు న్యాయవాది నల్లూరి మాధవరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రజల పక్షాన నిలబడే న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్‌, ముప్పాళ్ల సుబ్బారావు, మునిస్వామిలను అక్రమంగా నిర్బంధించడం సరికాదన్నారు. 


న్యాయవాదుల గృహనిర్బంధం అప్రజాస్వామికం

ఐలూ న్యాయ విద్యార్థుల విభాగం

జీవో 1ను వ్యతిరేకిస్తూ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చినందుకు ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌, న్యాయవాది మునిస్వామిని పోలీసులు సోమవారం అక్రమంగా గృహనిర్బంధం చేయడాన్ని ఐలూ న్యాయవిద్యార్థుల విభాగం ఖండించింది. జీవో 1ను రద్దుచేయాలని కన్వీనర్‌ పచ్చా కిరణ్‌, కో కన్వీనర్‌ జాషువా డానియేల్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మరోవైపు అక్రమ అరెస్టులు, నిర్బంధాలను ఖండిస్తున్నట్లు లాయర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఛైర్మన్‌, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మరో ప్రకటన విడుదల చేశారు.


వైద్యుల నియామకాలకు 23 నుంచి ఇంటర్వ్యూలు

ఈనాడు-అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్స్‌, స్పెషాల్టీ వైద్యుల నియామకాలకు ఈ నెల 23 నుంచి 27 వరకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరగనున్నాయి. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో విభాగాల వారీగా నిర్దేశించిన తేదీల్లో నిర్వహించనున్నారు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, గైనకాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్‌, ఆర్థో, ఆఫ్తల్మాలజీ తదితర విభాగాల్లో శాశ్వత, ఒప్పంద విధానంలో ఈ నియామకాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ‘హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

* హార్టికల్చర్‌ ఆఫీసర్ల ఉద్యోగాలకు తాత్కాలికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.


బీడీఎస్‌ తొలి ఏడాది ఫలితాల విడుదల

విజయవాడ (ఆరోగ్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొదటి సంవత్సరం బీడీఎస్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 164 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారని విజయవాడ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన నిమిత్తం సబ్జెక్టుకు రూ.2000 రిజిస్ట్రార్‌ పేరిట చెల్లించి మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.


ఏపీ లాసెట్ కన్వీనర్‌గా సత్యనారాయణ

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఏపీ లాసెట్ కన్వీనర్‌గా ఏఎన్‌యూ గణిత విభాగం ప్రొఫెసర్‌ సత్యనారాయణను నియమిస్తూ వీసీ రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఆయనకు నియామక పత్రం అందించారు.


డాక్యుమెంట్లు రద్దు చేసే అధికారంపై సవరణ బిల్లుకు ఆమోదం

ఈనాడు-అమరావతి: నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను.. జిల్లా రిజిస్ట్రార్లు విచారణ జరిపి రద్దు చేసే అధికారాన్ని కల్పించే సవరణ బిల్లును శాసన సభ ఆమోదించింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి చెందినది కావడంతో ఈ సవరణ బిల్లు ఉభయ సభల ఆమోదం తర్వాత కేంద్రానికి పంపనున్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలు, గ్రంథాలయాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఆలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో ఒక సభ్యుడిగా నాయీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారి నియామకం, మైనార్టీ, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీకాలాన్ని రెండేళ్లకు తగ్గింపు, బార్‌ అసోసియేషన్ల ఉమ్మడి ఉప-నిబంధనావళిని పాటించడం తప్పనిసరి చేస్తూ సవరణ బిల్లు, పాల ప్రమాణాలకు చెందిన సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని