రుషికొండను తనిఖీ చేసిన కేంద్ర కమిటీ!

వివాదాస్పదమైన రుషికొండ రిసార్టు పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి.

Updated : 21 Mar 2023 05:51 IST

ఈనాడు, విశాఖపట్నం: వివాదాస్పదమైన రుషికొండ రిసార్టు పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. పూర్తయిన భవన నిర్మాణాలకు అలంకరణ పనులు చేయాల్సి ఉంది. మరోవైపు రుషికొండ మీద జరిగిన తవ్వకాల్లో అక్రమాలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు హైకోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులతో నియమించిన కమిటీ కొద్దిరోజుల కిందట ప్రాజెక్టును పరిశీలించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్‌) ఏర్పాటు చేసిన జాతీయ సముద్ర అధ్యయన శాస్త్రం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర సుస్థిర తీర ప్రాంత నిర్వహణ సంస్థ, కేంద్ర ప్రభుత్వ పనుల విభాగాల నిపుణులు కొండ మీద జరిగిన పనుల తీరు, చేపట్టిన మట్టి తవ్వకాలను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈ పర్యటన అంతా గోప్యంగా సాగింది. వివిధ పనులకు సంబంధించిన అనుమతులు.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా రిసార్టు పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ పరిధికి మించి నిర్మాణాలు ఏమైనా చేపట్టారా? వంటి అంశాలను పరిశీలించినట్లు సమాచారం. దీంతో పాటు రుషికొండ-భీమిలి బీచ్‌ రోడ్డులో మట్టి తవ్వకాలు, ఎంవోఈఎఫ్‌ నిబంధనలు మీరడం వంటి వాటిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేసినట్లు తెలిసింది.

మూడో దశ పనులకు..: ఇక్కడి పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం మూడో దశ పనులకు మరో రూ.96.36 కోట్లతో తాజాగా ప్రతిపాదన చేసింది. చివరి దశలో చేపట్టే పనుల కోసం ఈ టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.270 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణను మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)కు అప్పగించింది. ప్రస్తుతం కొండ మీద యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ ఇంజినీరింగ్‌ విభాగానికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని