AP Assembly: శాసనసభలోనే దాడి

ఎమ్మెల్యేలపై దాడులకు రాష్ట్ర శాసనసభే వేదికైంది. సోమవారం అధికార, విపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు, దూషణలతో దద్దరిల్లింది.

Updated : 21 Mar 2023 07:52 IST

తెదేపా ఎమ్మెల్యే స్వామిపై దాడికి దిగిన వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
గోరంట్ల బుచ్చయ్య చౌదరిపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే వెలంపల్లి
తెదేపా సభ్యులే తనను గాయపరిచారన్న సుధాకర్‌బాబు
తోపులాటలో కిందపడిన ఆయన మోచేతికి స్వల్ప గాయం
జీవో 1పై తెదేపా ఆందోళన సందర్భంగా అవాంఛనీయ ఘటన
తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
ఈనాడు - అమరావతి

ఎమ్మెల్యేలపై దాడులకు రాష్ట్ర శాసనసభే వేదికైంది. సోమవారం అధికార, విపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు, దూషణలతో దద్దరిల్లింది. వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పోడియంపైకి దూసుకెళ్లి.. అక్కడ సభాపతి స్థానం వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిపై దాడికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సుధాకర్‌బాబు కింద పడిపోయారు. ఆయన మోచేతి కింద స్వల్పంగా గీసుకుపోయింది. వీటన్నింటి నడుమ సోమవారం ఉదయం శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరగంట పాటు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. తెదేపా సభ్యులే సభాపతిని అవమానించారని, ఆయన్ను కాపాడేందుకు తాము పోడియంపైకి వెళ్లామని వైకాపా సభ్యులు పేర్కొన్నారు. జీవో1 రద్దుచేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న తమ ఎమ్మెల్యేపై వైకాపా సభ్యులు దాడిచేశారని తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిణామాల మధ్య తెదేపా సభ్యులను ఒకరోజు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సీఎం జగన్‌ను కలిసినప్పుడు సుధాకర్‌బాబు మోచేతికి కట్టుతో కనిపించారు. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే  జీవో 1 రద్దు కోరుతూ తెదేపా సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ‘ఏ1 తెచ్చిన జీవో 1 రాజ్యాంగ వ్యతిరేకం, అది ప్రజల రక్షణకు కాదు.. జగన్‌ రక్షణకే’ అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లారు. తమ చేతుల్లోని పత్రాలను చించి పైకి విసిరారు. స్పీకర్‌ ముఖానికి ప్లకార్డులను అడ్డుగా పెట్టారు. సుమారు అరగంట పాటు తెదేపా సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో ఉపముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, అంజాద్‌బాషా, మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు విష్ణు, కరణం ధర్మశ్రీ తదితరులు తెదేపా సభ్యుల వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. సస్పెండ్‌ చేయించుకుని వెళ్లిపోవాలనే ఆలోచనతోనే వారు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఒక దశలో స్పీకర్‌ ముఖానికి ప్లకార్డు తగలడంతో చేత్తో తోసేసే ప్రయత్నం చేశారు.

పోడియంపైకి దూసుకెళ్లి దాడికి దిగిన సుధాకర్‌బాబు

ఉదయం 9.28 వరకు తెదేపా సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తెదేపా సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానం చదివేందుకు చీఫ్‌విప్‌ ప్రసాదరాజు ఉద్యుక్తులయ్యారు. ఇంతలో.. ‘మాకూ హక్కులు లేవా?’ అంటూ వైకాపా ఎమ్మెల్యే ఎలీజా పోడియంపైకి వెళ్లారు. సభాపతి పక్కనున్న తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మరో వైకాపా ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు పోడియంపైనున్న ఎమ్మెల్యే స్వామి వైపు దూసుకెళ్లి పక్కకు లాగుతూ కొట్టారు. దీంతో స్వామి కింద పడిపోయారు. ఆయన్ను కాపాడే ప్రయత్నంలో తెదేపా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ వేలికి చిన్న దెబ్బ తగిలింది. తోపులాటలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కింద పడిపోయారు. ఆయన మోచేతికి గాయమైంది. ఈ గందరగోళంతో చీఫ్‌విప్‌ ప్రసాదరాజు సస్పెన్షన్‌ తీర్మానం చదవకుండా ఆపేశారు.

చంద్రబాబు డౌన్‌.. డౌన్‌

హఠాత్పరిణామంతో సభ ఉలిక్కిపడింది. అప్రమత్తమైన వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు.. తెదేపా, చంద్రబాబు డౌన్‌డౌన్‌.. అనే నినాదాలతో పోడియం ముందుకు చేరుకున్నారు. ఇదే సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తూ ముందుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్షల్స్‌ రంగంలోకి దిగారు. తెదేపా సభ్యుల ముందు నిలబడి.. వైకాపా ఎమ్మెల్యేలను, మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకదశలో ఆగ్రహావేశాలతో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఊగిపోయారు. ఈ గందరగోళం నడుమ.. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపైకి దూసుకెళ్లారు. ఒకదశలో ఇరువురూ తలపడినంత పరిస్థితి నెలకొంది. కొందరు వైకాపా ఎమ్మెల్యేలతోపాటు మార్షల్స్‌ వెలంపల్లిని వెనక్కి తీసుకొచ్చారు. ఇవన్నీ జరుగుతుండగానే.. సభాపతి తమ్మినేని సీతారాం సభ వాయిదా వేయకుండానే తన స్థానం నుంచి ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు.

నేలపై కూర్చుని తెదేపా ఎమ్మెల్యేల నిరసన

తమ సభ్యులపై దాడిని నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. వైకాపా గూండాయిజం నశించాలని నినాదాలు చేశారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసుకున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తెదేపా సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యేల వైపు దూసుకెళ్లారు. వైకాపా ఎమ్మెల్యేలు ఆయన్ను వెనక్కి తీసుకొచ్చారు.

11 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్‌

ఉదయం 10.01 గంటలకు సభ మరోసారి సమావేశం కాగానే.. చీఫ్‌విప్‌ ప్రసాదరాజు తెదేపా సభ్యుల సస్పెన్షన్‌కు ప్రతిపాదించారు. తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, గద్దె రామ్మోహన్‌, వెలగపూడి రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామిని సభ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి సీతారాం ప్రకటించారు. దీంతో తెదేపా సభ్యులు మైకు ఇవ్వాలని డిమాండుచేశారు. ‘ఎస్సీ ఎమ్మెల్యేపై దాడిచేశారు. మాపై దాడిచేయించి సస్పెండ్‌ చేస్తారా?’ అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం మార్షల్స్‌ వచ్చి తెదేపా ఎమ్మెల్యే స్వామిని చేతులపై ఎత్తుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం తెదేపా సభ్యులు ‘గూండాలు, రౌడీలు అసెంబ్లీకి వచ్చినట్లుంది. నియంతల రాజ్యం నశించాలి’ అని నినాదాలిస్తూ బయటకు వెళ్లారు.

ఎలీజాకు రక్షణగానే వెళ్లా: సుధాకర్‌బాబు

సభాపతిపై దాడి చేస్తున్నారనే ఎమ్మెల్యే ఎలీజా పోడియం వద్దకు వెళ్లారని, ఆయనకు రక్షణగానే తానూ వెళ్లానని సుధాకర్‌బాబు పేర్కొన్నారు. ‘నాకు రక్తం వచ్చేలా గాయపరచిన తెదేపా సభ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి. తెదేపా పన్నాగాలు చూస్తుంటే భయమేస్తోంది. నాకు రక్షణ కల్పించండి. ఎన్నికల్లో తిరిగేటప్పుడు భౌతికదాడులు జరిగే అవకాశం ఉంది’ అన్నారు. ‘అల్లరి జరిగేటప్పుడు పైకి వెళ్లి మాకూ హక్కులుంటాయిగా అని అడిగా.. అవి మీ దాకా చేరలేదు. తెదేపా సభ్యులు దాడిచేయడంతో నన్ను కాపాడటానికే సుధాకర్‌బాబు వచ్చారు. బాల వీరాంజనేయస్వామిని సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్‌ చేయాలి’ అని ఎమ్మెల్యే ఎలీజా డిమాండు చేశారు.

ఉప ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా?

సభాపతిని ఎక్కడ కొట్టేస్తారో అని తనకు భయమేసిందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు. తనపై బాల వీరాంజనేయస్వామి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఉపముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

భరించలేని ఆవేశం వస్తుంది: మంత్రి అంబటి రాంబాబు

‘ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి సభలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సభాపతిని పొడిచి, వాదనకు దిగే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే భరించలేని ఆవేశం వస్తుంది. మా సభ్యులపైకి రావడం, గందరగోళం సృష్టించడం బాధాకరం. తమ నాయకుడు లేరు కాబట్టి ఎలాంటి అరాచకమైనా సృష్టించొచ్చనేలా తెదేపా సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలి’ అని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

మా వాళ్లూ ఉద్రేకపడితే ఎలా ఉండేదో

‘ముందస్తు ప్రణాళిక ప్రకారమే తెదేపా సభ్యులు ఇదంతా చేశారు. వాళ్లు 11 మంది ఉన్నారు. ఆ సమయంలో మా పార్టీసభ్యులు 120 మందిపైగా ఉన్నారు. వాళ్లంతా ఉద్రేకానికి లోనైతే పరిస్థితి ఎలా ఉండేదో..?’ అని మంత్రి విశ్వరూప్‌ అన్నారు. అటెండరును పక్కకు తోసి సభాపతిపై పడిపోయే పరిస్థితి ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సభాపతి సహనాన్ని అలుసుగా తీసుకుంటున్నారని, కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తెదేపా సభ్యులు సంస్కారం కోల్పోయి గూండాయిజానికి దిగారని మంత్రి రజిని విమర్శించారు. ‘దళితుడ్ని కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకోవడం సరికాదు. ప్రకాశం జిల్లావాసులకు తలవంపులు తెచ్చే కార్యక్రమం ఇది’ అని మంత్రి సురేష్‌ విరుచుకుపడ్డారు. ‘సభాపతిని అవమానించారు. సుధాకర్‌బాబుపై దాడిచేశారు. ఉప ముఖ్యమంత్రిని బూతులు తిట్టారు. తెదేపా సభ్యులు సభలో దారుణంగా వ్యవహరించి బయటకు వెళ్లి అబద్ధాలు చెబుతున్నారు’ అని మంత్రి రోజా ధ్వజమెత్తారు. ‘సభాపతిని ఛాంబర్‌ నుంచి బయటకు రాకుండా చేసిన చరిత్ర తెదేపా సభ్యులది.. సోమవారం తెదేపా సభ్యులు స్పీకర్‌పై దాడిచేయడం ఒక్కటే తక్కువ.. మీరు (సభాపతి) సింహంలాగే ఉండండి. బుద్ధుడిగా మారొద్దు’ అని ఎమ్మెల్యే ఆర్థర్‌ పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే సుధాకర్‌బాబును రక్షించాలి. ఆయనకు భద్రత ఇవ్వాలి. సభలోనే ఇలా దాడి చేస్తే బయటకు వెళ్లి మరేం చేస్తారో’ అని ఎమ్మెల్యే జోగారావు ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లాది విష్ణు, కొండేటి చిట్టిబాబు డిమాండు చేశారు.


జగన్‌ దృష్టిలో పడటానికే దాడి

‘‘తెదేపా ఎస్సీ శాసనసభ్యుడు సభలో ఉండటం వైకాపా వాళ్లకు కంటగింపుగా ఉంది. జగన్‌ దృష్టిలో పడాలనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, ఎలిజాలు నాపై దాడి చేశారు. ముందువరుసలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాకుండా ఎక్కడో వెనుకవరుసలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు ఎందుకొచ్చారు? గతంలోనూ సుధాకర్‌బాబు నాపై దాడి చేశారు. గత శాసనసభా సమావేశాల్లో మంత్రి మేరుగు నాగార్జున నన్ను కించపరుస్తూ అసభ్యపదజాలంతో దూషించారు. ప్రజాసమస్యల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నాననే నాతో ఇలా వ్యవహరిస్తున్నారు’’

 ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి


కారుమూరి ముందు నా పర్సనాలిటీ ఎంత?

‘‘అధికార పార్టీ సభ్యులు 151 మంది ఉండగా మేం 14 మందిమి వారిపై దాడి చేశామంటున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై దాడి చేసే వయసూ, పర్సనాలిటీ నాకు లేవు. ఆయన నన్ను తోసేస్తే మా వాళ్లు నన్ను కిందపడకుండా పట్టుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రశ్నించడమే మేం చేసిన నేరమా?’’

 ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని