అంగన్‌వాడీలపై ఉక్కుపాదం

డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 21 Mar 2023 06:43 IST

ఎక్కడికక్కడ అరెస్టులు.. నిర్బంధాలు
పోలీసుల కళ్లు గప్పి వేలల్లో విజయవాడకు వచ్చిన కార్యకర్తలు
నగరంలోని ఏలూరు రోడ్డుపై హోరెత్తిన నినాదాలు
ఈడ్చుకెళ్లిన పోలీసులు.. స్టేషన్లలోనూ నిరసనల వెల్లువ
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పథం.. కొనసాగిన ఉద్రిక్తత
ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి, న్యూస్‌టుడే-అలంకార్‌ కూడలి, గవర్నర్‌పేట

డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి విజయవాడకు వేలాది కార్యకర్తలు తరలివచ్చారు. వారి నినాదాలు, నిరసనలతో నగరం హోరెత్తింది. ఆందోళనలో పాల్గొనడానికి వివిధ పట్టణాలు, పల్లెలనుంచి బయలుదేరిన వారినీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. కళ్లుగప్పి విజయవాడకు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు నియంత్రించారు. బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో కుక్కి స్టేషన్లకు తరలించారు. వారితో నగర ప్రాంతంలోని పోలీసుస్టేషన్లు నిండిపోయాయి. దీంతో వందల మంది కార్యకర్తలను కల్యాణమండపాలు, ఇతర ప్రాంతాలకూ తరలించారు. పోలీసులతో తోపులాటలేర్పడి కొందరు కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. తమకిచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు నినదించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. 

చలో విజయవాడలో పాల్గొనేందుకు తెల్లవారుజామునే వివిధ ప్రాంతాలనుంచి నగరానికి చేరుకున్న అంగన్‌వాడీలను బస్టాండ్‌, రైల్వేస్టేషన్లకు వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాచౌక్‌ వైపు వస్తున్న వారిని అలంకార్‌ కూడలిలో అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి చాలామంది ముందు రోజే విజయవాడకు చేరుకుని బంధువుల ఇళ్లలో బస చేశారు. దీంతో ఎవరి కంటపడకుండా వారు భారీగా బీసెంట్‌ రోడ్డు, బీఆర్టీఎస్‌ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, గాంధీనగర్‌ ప్రాంతాలకు చేరుకున్నారు. అందరూ ఒక్కసారిగా ఏలూరు రోడ్డుపైకి చేరుకున్నారు. ఈ రోడ్డుపై గంటన్నరపాటు ఆందోళన సాగి ట్రాఫిక్‌ నిలిచింది. పోలీసులు తేరుకుని అదనపు బలగాలను రప్పించారు. లెనిన్‌ సెంటర్‌, ధర్నాచౌక్‌ వైపు వెళ్లే వారిని అతికష్టంపై నిలువరించారు.

పోలీసుల అరెస్టులతో ఇరువర్గాల మధ్య వాగ్వాదమేర్పడింది. ఒక వైపు రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్టు చేస్తుండగా, మిగిలినవారు రెండో వైపునకు చేరుకుని అటువైపు వెళ్లే వాహనాలకు అడ్డుగా కూర్చున్నారు. వీరికి మద్దతుగా వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ నాయకుడు ఏవీ నాగేశ్వరరావు సారథ్యంలో కొందరు అంగన్‌వాడీలు దుర్గాపురం మీదుగా సాంబమూర్తి రోడ్డు వైపు వచ్చారు. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు సాగారు. వారిని ధర్నాచౌక్‌ సమీపంలో అరెస్టు చేశారు. సీపీఎం నేత మధు సారథ్యంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చినవారిని నిలువరించేందుకు పోలీసులు చెమటోడ్చారు. తోపులాటలు కొనసాగాయి. అరెస్టయి స్టేషన్లు, కల్యాణమండపాలకు చేరిన ఉద్యమకారులు అక్కడా ధర్నా కొనసాగించారు. వేతనాలను ప్రభుత్వం 4నెలలుగా చెల్లించడం లేదని, తెలంగాణలోని అంగన్‌వాడీలకు మించి వేతనాలను ఇస్తామన్న సీఎం హామీని విస్మరించారని కార్యకర్తలు వాపోయారు. మహిళా పోలీసులపై కొందరు ఆందోళనకారులు తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

తోపులాటలో అనంతపురానికి చెందిన కార్యకర్త కమల స్పృహ తప్పారు. సహచరులే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో అంగన్‌వాడీ కార్యకర్తకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకో కార్యకర్త సొమ్మసిల్లి ఏలూరు రోడ్డు డివైడర్‌పై పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగానూ నిరసనల హారు

అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలను నిరసిస్తూ అంగన్‌వాడీలు ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. నిరసనల్లో పాల్గొనరాదని సంఘ నేతలకు 2 రోజుల ముందే నోటీసులిచ్చిన పోలీసులు ఆదివారం రాత్రినుంచే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కార్యకర్తలు, సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చేరుకునే ప్రధాన రహదారుల్లోని టోల్‌గేట్ల వద్ద పహారా పెంచారు.  కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలనుంచి వస్తున్న కార్యకర్తలను కలపర్రు టోల్‌గేటు వద్ద, ప్రకాశం, రాయలసీమ జిల్లాలనుంచి వస్తున్న వారిని కాజ టోల్‌గేటు వద్ద అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. పిఠాపురం రైల్వేస్టేషన్‌ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ అక్కడే వారు ధర్నా చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట మండలాలకు చెందిన అంగన్‌వాడీ సిబ్బందిని తెల్లవారుజామున ఐదింటినుంచే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మండపేట గ్రామీణ పోలీసుస్టేషన్‌కు 45మందిని తరలించారు. పెద్దాపురంలోనూ 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరంలో ఉద్యమకారులు ధర్నా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్ల, గుంటూరులలో కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు బైఠాయించారు. అంతర్‌రాష్ట్ర రహదారిపైకి ర్యాలీగా చేరుకుని బైఠాయించారు. విశాఖ జగదాంబ సెంటర్‌ నుంచి వాచ్‌హౌస్‌ వరకు రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. అనకాపల్లిలోనూ ధర్నా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని