నిండా మునిగిన అన్నదాత

అకాల వర్షాలు రాష్ట్రంలోని అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. అప్పులు చేసి పెట్టుబడి పెడితే ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన చెందుతున్నారు.

Published : 21 Mar 2023 05:33 IST

దిగుబడి చేతికొచ్చే వేళ అకాల వర్షాలు
లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
మనస్తాపంతో చిత్తూరు జిల్లాలో రైతు బలవన్మరణం

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: అకాల వర్షాలు రాష్ట్రంలోని అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశాయి. అప్పులు చేసి పెట్టుబడి పెడితే ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నడమిగడదేశి గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌(45) మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. భాస్కర్‌ తమకున్న రెండు ఎకరాల్లో కాలీఫ్లవర్‌, టమాట సాగు చేశారు. రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. రెండు రోజుల కిందట కురిసిన వడగళ్ల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతింది.

* రాష్ట్రంలో 3 లక్షల పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్‌లో వందల ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. కృష్ణాజిల్లాలో మిర్చి, మొక్కజొన్న, మినుము, అరటి తదితర పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి తడవకుండా కాపాడుకొనేందుకు నాలుగురోజుల నుంచి రాత్రింబవళ్లు కల్లాల వద్దే ఉంటున్నామని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో అరటి, తమలపాకు, కూరగాయల తోటలు 220 హెక్టార్లలో, మొక్కజొన్న, జొన్న పంటలు 1320 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో 12 ఎకరాల్లో అరటికి నష్టం జరిగినట్లు గుర్తించారు. పల్నాడు జిల్లాలో మొక్కజొన్న 1313 హెక్టార్లు, వరి 560, నువ్వులు 11 హెక్టార్లల్లో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో వరి, జీడిమామిడి, మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా నార్పల మండలంలో 2,200 ఎకరాల్లో అరటితోటలు, 800 ఎకరాల్లో మామిడి, బొప్పాయి, చీనీ పంటలు దెబ్బతిన్నాయి. 

రైతులను ఆదుకుంటాం: ‘అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. వర్షాలు తగ్గిన వెంటనే వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టంపై పారదర్శకంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం’ అని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌చెప్పారు.

మరో రెండు రోజులు వర్షాలు: దక్షిణ కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ మీదుగా తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్‌ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. లేదా ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు  తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని