AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్‌ అయినట్లే.. రూలింగ్‌ ఇచ్చిన స్పీకర్‌ తమ్మినేని

‘తెదేపా సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. స్పీకర్‌గా ఎవరున్నారనేది కాదు. ఈ స్థానం కీలకమైనది. గౌరవప్రదమైన నిరసన తెలిపితే అభ్యంతరం లేదు.

Updated : 21 Mar 2023 08:14 IST

ఈ సభకు స్పీకర్‌గా ఉండటం బాధగా ఉంది
శ్రీరామచంద్రుడు వంటి మన నాయకుడికి రావణుడిని ఎలా చంపాలో తెలుసని వ్యాఖ్య

ఈనాడు - అమరావతి: ‘తెదేపా సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. స్పీకర్‌గా ఎవరున్నారనేది కాదు. ఈ స్థానం కీలకమైనది. గౌరవప్రదమైన నిరసన తెలిపితే అభ్యంతరం లేదు. సభాపతి స్థానాన్ని, సభ గౌరవాన్ని తగ్గించే విధంగా తెదేపా సభ్యుల ప్రవర్తన ఆక్షేపణీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సి ఉంది. సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోడియం వద్దకు వచ్చి సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే ఆటోమెటిక్‌ సస్పెండ్‌ అయ్యేలా రూల్‌ను అమల్లోకి తెస్తున్నా...’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శాసనసభలో సోమవారం జరిగిన పరిణామాలపై ఆయన మాట్లాడారు. ‘ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ తర్వాత వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టేలా 2016లోనే శాసనసభ నిర్ణయం తీసుకుంది. అదేమీ తెలియకుండా వ్యవహరించడం దురదృష్టకరం. ప్రభుత్వం ఏం చేసింది, చేయబోతోంది అనేది గవర్నర్‌ ప్రసంగం ద్వారా చెప్పడం రాజ్యాంగ సంప్రదాయం. దానికి కూడా గౌరవాన్ని ఇవ్వలేని ప్రతిపక్షం సభలో ఉండటం, ఆ సభలో నేను స్పీకర్‌గా ఉండటం బాధగా ఉంది. సభ్యులు, పార్టీల పట్ల నాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఎస్సీ ఎమ్మెల్యేల పేరిట సభలో చర్చ రావడం దురదృష్టకరం. ఇదంతా సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకే. దీనిని సభ చూస్తూ ఊరుకోవాలా? వాయిదా తీర్మానం ఇప్పుడే చదవాలని అచ్చెన్నాయుడు అన్నారు. సీనియారిటీ అంటే ఇదేనా? ఎవరు బుద్ధిమంతుడైతే వాడు వృద్ధుడు కానీ, ఏండ్లు మీరినవాడు కాదని.. పోగాలం దాపురించినప్పుడు మూర్ఖులు కనరు వినరు అని పరవస్తు చిన్నయసూరి చెప్పారు. ప్లకార్డులు ముఖానికి అడ్డంగా పెట్టారు. వాటిని చేతితో పక్కకు తీస్తే.. స్పీకర్‌ చేయిచేసుకున్నారని హడావుడి చేశారు. మీకు ఎవరు చెప్పి పంపారు? నాయకుడు ఎలా ఉంటే, కింద వాళ్లు అలానే ఉంటారు. ఎంత కవ్వించినా.. నేను స్పందించలేదు. పేపరు చింపి నా మీద వేస్తే.. పువ్వులు వేసినట్లు భావించాను. ఇతర సభ్యుల హక్కులను హరిస్తుంటే ఊరుకోవాలా? సభ నిర్వహణకు ప్రతి నిమిషానికి ఎంతో ఖర్చు చేస్తున్నాం. ధనం, సమయం వృథా చేస్తున్నారు. మీరు శాసనసభకు పనికొస్తారా? లేదా? అనేది సమయం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. రావణాసురుడిని శ్రీరామచంద్రుడు సంహరించాడు. మన ముందు శ్రీరామచంద్రుడి వంటి నాయకుడు ఉన్నాడు. రావణుడిని ఎలా చంపాలో ఆయనకు తెలుసు. రేపు కదనరంగంలో నిరూపించుకుందాం. ఈ సభలో ఎందుకు అనవసర న్యూసెన్స్‌....’ అని స్పీకర్‌ సీతారాం పేర్కొన్నారు.

సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయాలి: మంత్రి సురేష్‌

ఈ ఉదంతాన్ని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు. ఆ సభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాళ్లు చేసిన దుర్మార్గాన్ని అలా వదిలేయకూడదని తెలిపారు. మీరు సంతకాలు పెట్టి పంపితే, దానిని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేస్తానని స్పీకర్‌ సీతారాం చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు