మూడేళ్ల తర్వాత పిటిషనా?

జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్‌కు సున్నపురాయి గనుల కేటాయింపు వ్యవహారంలో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Published : 21 Mar 2023 03:39 IST

శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్‌కు సున్నపురాయి గనుల కేటాయింపు వ్యవహారంలో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన మూడేళ్ల తర్వాత దానిని సవాలు చేస్తూ పిటిషన్‌ వేయడమేమిటంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేసింది. సున్నపురాయి గనుల కేటాయింపులో శ్రీలక్ష్మిపై కొన్ని సెక్షన్ల కింద దాఖలైన కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను, మరికొన్ని సెక్షన్ల కింద విచారణను ఎదుర్కోవాలని హైకోర్టు 2017లో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ శ్రీలక్ష్మి... సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్లను సోమవారం విచారించింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ‘అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో శ్రీలక్ష్మిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నాం. ఈ కేసులో ఇప్పటికే 13 ఛార్జిషీట్లు ఉన్నాయి. ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఇతర నిందితులతో కుమ్మక్కై శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలిసినా ఉద్దేశపూర్వకంగానే 407 హెక్టార్లలోని సున్నపురాయి గనులపై జయా మినరల్స్‌కు లైసెన్సులు ఇవ్వాలని సంబంధిత మంత్రికి దస్త్రాన్ని పంపారు. సరైన తనిఖీలు నిర్వహించకుండానే లైసెన్సులు మంజూరు చేశారు. జయా మినరల్స్‌ నుంచి ఈశ్వర్‌ సిమెంట్‌కు లైసెన్సులు బదిలీ అయ్యాయి’ అని ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌... అసలు ఆమె విధులు ఏమిటి? ఏ చట్టం ప్రకారం అలా చేశారు? అని ప్రశ్నించారు. స్పందించిన ఏఎస్‌జీ... అవన్నీ విచారణ సమయంలో తెలుస్తాయని తెలిపారు. ఈ కేసులో 13 మంది నిందితులు ఉన్నారని, వారంతా కలిసి కుట్రకు పాల్పడ్డారని ధర్మాసనానికి వివరించారు. లైసెన్సుల బదిలీ నిబంధనలకు విరుద్ధమైనప్పుడు అక్రమం అవుతుందే తప్ప కుట్ర ఏముందని జస్టిస్‌ రవీంద్ర భట్‌ ప్రశ్నించారు. ప్రస్తుత పిటిషన్‌ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతిపైనే తప్ప దర్యాప్తు విషయంలో కాదని ఏఎస్‌జీ తెలిపారు. పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది విన్నపం మేరకు కేసు విచారణను ధర్మాసనం ముగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని