ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధాలు
ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న జీవో నంబరు-1ని రద్దు చేయాలనే డిమాండుతో ‘జీవో-1 రద్దు పోరాట ఐక్య వేదిక’ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
పోరాట ఐక్యవేదిక చేపట్టిన చలో అసెంబ్లీపై ఉక్కుపాదం
జీవో-1 రద్దు చేయాలంటూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా నాయకుల అరెస్టు
ఈనాడు, అమరావతి: ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న జీవో నంబరు-1ని రద్దు చేయాలనే డిమాండుతో ‘జీవో-1 రద్దు పోరాట ఐక్య వేదిక’ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ జిల్లాల నుంచి ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలు విజయవాడ రాకుండా ఆదివారం నుంచే గృహనిర్బంధాలు,అరెస్టులతో నిలువరించిన పోలీసులు.. సోమవారం మరింతగా నిర్బంధాన్ని అమలుచేశారు. అసెంబ్లీ వైపు వెళ్లే మార్గాలన్నింటిలో బందోబస్తు పెంచారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి, గుర్తింపు కార్డులు పరిశీలించి పంపించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ సహా పలువురు ముఖ్యుల్ని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోరాట ఐక్య వేదిక కన్వీనర్లలో ఒకరైన సుంకర రాజేంద్రప్రసాద్‌ను విజయవాడలోని ఆయన నివాసంలో, మరో కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావును రాజానగరం పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు.
బలవంతంగా తీసుకెళ్లి...: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, దోనెపూడి శంకర్, జి.కోటేశ్వరరావు, ఈశ్వరయ్య, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తదితరులు విజయవాడలోని దాసరి భవన్(సీపీఐ రాష్ట్ర కార్యాలయం) నుంచి అసెంబ్లీని ముట్టడించేందుకు బయల్దేరగా పోలీసులు వారిని అక్కడే నిలువరించారు. సీపీఐ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం నాయకులంతా తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకూ ర్యాలీగా తరలివెళ్లారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన జీవో-1ని రద్దు చేయాలంటూ నినదించారు. అక్కడి నుంచి నాయకులందరూ అసెంబ్లీ మార్గం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఇతర నాయకులు వై.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్, టీఎన్‌టీయూసీ, ఎస్‌ఎఫ్‌ఐ తదితర విభాగాల నాయకులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు వేర్వేరుగా చేరుకుని అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకు ముందూ కళాక్షేత్రం వద్దకు చేరుకున్న వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పోలీసుస్టేషన్‌లోనే నిర్బంధించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఎక్కడికక్కడే...: ఆదివారం మధ్యాహ్నం పోరాట ఐక్య వేదిక కన్వీనర్, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. సాయంత్రం రాజానగరం పోలీసుస్టేషన్‌కు తరలించి రాత్రంతా నిర్బంధించారు. సుబ్బారావు తరఫు న్యాయవాదులు హైకోర్టులో హెబియస్‌కార్పస్ రిట్ దాఖలు చేయగా... సోమవారం ఉదయం పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు. పోరాట ఐక్య వేదిక మరో కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాద్‌ను విజయవాడ సీతారామపురంలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. సోమవారం సాయంత్రంవరకూ బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. వివిధ జిల్లాల్లో సైతం పోరాట ఐక్య వేదిక, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులకు నోటీసులిచ్చి గృహనిర్బంధం చేశారు.
న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అక్రమ అరెస్టుపై హైకోర్టులో వ్యాజ్యం
విడిచిపెట్టినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
జీవో నంబరు 1ని రద్దు చేయాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, భారత న్యాయవాదుల సంఘం(ఐఏఎల్) ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావును రాజమహేంద్రవరం 1వ పట్టణ, రాజానగరం పోలీసులు అక్రమం అరెస్టు చేయడంపై సోమవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలైంది. సుబ్బారావు కుమారుడు విశాల్‌స్ఫూర్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వ్యాజ్యం వేశాక సుబ్బారావును విడిచిపెట్టినట్లు పోలీసుల తరఫు ప్రభుత్వ న్యాయవాది తెలిపారన్నారు. అక్రమ అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధ్యులైన పోలీసుల నుంచి రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Crime News
Toll Gate: గేటు తీయడం ఆలస్యమైందని.. టోల్ ఉద్యోగి హత్య
-
Movies News
Siddharth: ఒంటరిగా పోరాడలేకపోతున్నా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: సిద్దార్థ్