రికార్డు స్థాయిలో విద్యుత్తు వెలుగులు

నాగార్జునసాగర్‌ కుడిగట్టుపై ఉన్న జల విద్యుత్‌ కేంద్రం ఈ ఏడాది (మార్చి 1 నాటికి) రికార్డు స్థాయిలో 283.513 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది.

Published : 21 Mar 2023 05:19 IST

సాగర్‌ కుడిగట్టు విద్యుత్తు కేంద్రంలో మైలురాయి
మార్చి 1 నాటికి 283.513 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి
నలభై ఏళ్లలో ఇదే గరిష్ఠం

ఈనాడు, అమరావతి: నాగార్జునసాగర్‌ కుడిగట్టుపై ఉన్న జల విద్యుత్‌ కేంద్రం ఈ ఏడాది (మార్చి 1 నాటికి) రికార్డు స్థాయిలో 283.513 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. కుడిగట్టు విద్యుత్తు కేంద్రం స్థాపించి ఫిబ్రవరి 25 నాటికి 40 ఏళ్లు పూర్తయిన వేళ ఈ రికార్డు సాధించడం విశేషం. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా విద్యుత్తు ఉత్పత్తి జరగడంతో ఈ ఘనత సాధించారు. నాగార్జునసాగర్‌ జలాశయంలో 530 అడుగులపైన నీటి నిల్వలున్నప్పుడు సాగర్‌ కుడికాలువ కింద అవసరాలకు కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి తీసుకుంటున్నారు. విద్యుత్తు కేంద్రం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వెసులుబాటు ఉంది. అయితే కుడికాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులే కావడంతో ఆ మేరకే నీటిని వదులుతున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సాగర్‌ కుడికాలువ కింద తాగు, సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే క్రమంలో డ్యామ్‌లో 530 అడుగులపైన నిల్వలు ఉండటంతో పవర్‌హౌస్‌ ద్వారా నీటిని వాడుకున్నారు. దీంతో వేసవిలో (ఏప్రిల్‌, మే నెలల్లో)నూ కొంతమేర విద్యుత్తు ఉత్పత్తి చేశారు. జూన్‌ నుంచి నదికి వరద నీరు రావడంతో కాలువకు నిరంతరాయంగా నీటిని విడుదల చేస్తుండటంతో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది.

40 ఏళ్ల వేళ కొత్త మైలురాయి

నాగార్జునసాగర్‌ కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1983 ఫిబ్రవరి 25న ఉత్పత్తి మొదలైంది. గత నెల 25 నాటికి 40 ఏళ్లు పూర్తయింది. ప్రారంభించినప్పటి నుంచి ఈ మార్చి వరకు మొత్తం 6,032.533 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. 2006-07లో అత్యధికంగా 283.512 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తితో ఈ కేంద్రం రికార్డు సృష్టించింది. దాన్ని అధిగమిస్తూ ఈ నెల 1న 283.513 మిలియన్‌ యూనిట్ల మైలురాయిని చేరుకుంది. కుడి కాలువకు నీటివిడుదల కొనసాగుతున్నందున ఇంకా ఉత్పత్తి జరుగుతోంది. నిరంతర పర్యవేక్షణ, విద్యుదుత్పత్తికి అంతరాయం కలగకుండా కాలువ అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయడంతో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధ్యమైందని జెన్‌కో ఇంజినీర్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని