‘ముఖ గుర్తింపు’తో అక్రమాలకు అడ్డుకట్ట

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు దర్శనం, వసతిలో ఇబ్బందులు కలగకుండా తితిదే చర్యలు తీసుకుంటోంది.

Published : 21 Mar 2023 05:19 IST

శ్రీవారి భక్తులకు త్వరితగతిన గదుల కేటాయింపు
పెరిగిన ఆక్యుపెన్సీ రేటు, ఆదాయం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు దర్శనం, వసతిలో ఇబ్బందులు కలగకుండా తితిదే చర్యలు తీసుకుంటోంది. దళారులు, అక్రమార్కుల కారణంగా భక్తులకు ఎదురవుతున్న సమస్యలకు అడ్డుకట్టవేసేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. గదుల కేటాయింపు, ఉచిత లడ్డూల పంపిణీ కేంద్రాల వద్ద ఇటీవల నుంచి అమలుచేస్తోన్న ముఖ గుర్తింపు ఆధారిత సాంకేతికతతో సత్ఫలితాలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

తిరుమలలో భక్తుల కోసం దాదాపు 7,200 గదులు ఉన్నాయి. పద్మావతి విచారణ కేంద్రం పరిధిలో సుమారు 1500 ఉండగా, ఆన్‌లైన్‌ ద్వారా మరో 1500 గదులు కేటాయిస్తారు. 3500 గదులు కరెంట్‌ బుకింగ్‌ ద్వారా సీఆర్వో మిగిలిన కేంద్రాల ద్వారా భక్తులకు ఇస్తుంటారు. ఈ కేంద్రాల వద్ద కొందరు దళారులు, అక్రమార్కులు ఇతరుల పేరుతో గదులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి అడ్డుకట్టవేసేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి ముఖ ఆధారిత గుర్తింపు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త విధానంలో ఎవరైతే గదిని పొందుతారో వారే వచ్చి ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాషన్‌ డిపాజిట్‌ రిఫండ్‌ కోసం కూడా గదిని పొందిన భక్తుడే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఆధార్‌ కార్డుతో గదులను పొందిన భక్తుడు మరో 30 రోజులపాటు పొందే అవకాశం లేదు.

త్వరగా కేటాయింపు: గతంలో సీఆర్వోతోపాటు మిగిలిన ప్రాంతాల్లోని వసతి గదుల రిజిస్ట్రేషన్‌ కేంద్రాల వద్ద భక్తుడు ఆధార్‌తో నమోదు చేసుకుంటే  మెసేజ్‌లు వచ్చేందుకు కొన్ని గంటల సమయం పట్టేది. కొత్త సాంకేతికతతో ఐదు, పది నిమిషాల్లోనే మేసేజ్‌లు వస్తున్నాయి. దీంతో గదుల కేటాయింపు వేగంగా జరుగుతుంది. 

తితిదేకు భారీగా ఆదాయం: తిరుమలలో భక్తులకు త్వరితగతిన గదుల లభ్యమవడంతో ఆక్యుపెన్సీరేటు కూడా 86 శాతం నుంచి 108 శాతానికి పెరిగింది. అంటే ఒకే గదిని ఒక భక్తుడు పొంది ఖాళీచేసి, మరో భక్తుడు తీసుకోవడం ద్వారా రోజులో మూడుసార్లు గదులను కేటాయిస్తున్నారు. దీంతో తితిదేకు భారీగా ఆదాయం పెరిగింది. గదుల కేటాయింపు ద్వారా గత సంవత్సరం డిసెంబరులో రూ.2.65 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది జనవరిలో రూ.2.39 కోట్లు వచ్చింది. ఈనెల 1 నుంచి 12వ తేదీ వరకు గదుల కేటాయింపుతో తితిదేకు అత్యధికంగా రూ.2.95 కోట్లు రాబడి వచ్చింది.


వేగంగా గదులు అందించడమే లక్ష్యం

తిరుమలకు వచ్చే భక్తులకు వేగంగా గదులు అందించడంతోపాటు దళారులు, అక్రమార్కుల బారిన పడకుండా ముఖ గుర్తింపు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో గదుల లభ్యత భారీగా పెరిగింది. భక్తులకు నిమిషాల వ్యవధిలోనే గదులు లభిస్తున్నాయి.  

 తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు