పోలవరం నిర్వాసితుల్లో 11.90 శాతం మందికే అందిన పరిహారం

పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 1,06,006 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటివరకు 12,622 (11.90%) కుటుంబాలకు మాత్రమే చట్టప్రకారం పరిహారం అందించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు.

Updated : 21 Mar 2023 06:25 IST

రాజ్యసభలో వెల్లడించిన కేంద్రమంత్రి 

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 1,06,006 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటివరకు 12,622 (11.90%) కుటుంబాలకు మాత్రమే చట్టప్రకారం పరిహారం అందించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ సోమవారం అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. విభజన చట్టం ప్రకారం భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలను కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందన్నారు. 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా సహాయ, పునరావాస ప్రయోజనాలు అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇందులో ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు లేదా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నట్లు వివరించారు. ఇది కాకుండా అన్ని కుటుంబాలకు రూ.36 వేలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అదనంగా రూ.50 వేలు, కుటుంబం తరలి వెళ్లడానికి రవాణా ఖర్చుల కింద రూ.50 వేలు, పునరావాసం కోసం రూ.50 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇవి కాకుండా కళాకారులు, చిరు వ్యాపారులు ఉంటే వారికి రూ.25 వేలు, చిరు దుకాణాలు, పశువుల పాకలు ఉన్న వారికి రూ.25 వేలు అదనంగా ఇస్తున్నట్లు వివరించారు. సగటున ఎస్సీ, ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు రూ. 6.86 లక్షలు, ఇతర కుటుంబాలకు రూ. 6.36 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామన్నారు. భూమిని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా నిబంధనల ప్రకారం భూమి ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు ఇందిరా ఆవాస్‌ యోజన కింద ప్రతి కుటుంబానికి ఒక ఇంటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా సహాయ, పునరావాసం కోసం 6,089 దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని చెప్పారు. ఇందులో 3,412 దరఖాస్తులకు పరిహారం పొందే అర్హత లేదని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కొందరు ఆ ప్రాంత వాసులు కాదని, మరికొందరికి 18 ఏళ్ల వయసు నిండకపోవడమే దీనికి కారణమని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు