మాస్టర్‌ ప్లాన్‌లో అడ్డగోలు మార్పులు

అమరావతి విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం... రాజధాని బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌)లో అడ్డగోలుగా మార్పులు చేసింది. రాజధాని గ్రామాల ప్రజలు, అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకించినా, గ్రామసభల్లో తీర్మానాలు చేసినా పెడచెవిన పెట్టింది.

Published : 22 Mar 2023 07:40 IST

900 ఎకరాలతో ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌
రైతుల అభ్యంతరాలు, గ్రామసభల తీర్మానాలను పట్టించుకోని ప్రభుత్వం
హైకోర్టులో కేసు విచారణలో ఉన్నా.. ఏకపక్షంగా నిర్ణయం

ఈనాడు, అమరావతి: అమరావతి విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం... రాజధాని బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌)లో అడ్డగోలుగా మార్పులు చేసింది. రాజధాని గ్రామాల ప్రజలు, అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకించినా, గ్రామసభల్లో తీర్మానాలు చేసినా పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ప్రత్యేకంగా ఆర్‌5 జోన్‌ ఏర్పాటుచేసింది. ఆ మేరకు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల వంటి రాజధానికి వెలుపలి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికిపైగా పేదలకు అమరావతిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో జీవో విడుదల చేసింది. దాన్ని రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేయగా... కోర్టు ఆ జీవోను కొట్టేసింది. దాంతో మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి, ఆర్‌5 జోన్‌ ఏర్పాటుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టంలో రాష్ట్రప్రభుత్వం కొన్ని నెలల క్రితం సవరణలు చేసింది. దాన్ని సవాలుచేస్తూ రాజధాని రైతులు వేసిన కేసు హైకోర్టులో విచారణలో ఉంది. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండగానే... రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు చేయడంపై రాజధాని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో వివిధ జోన్లలో ఉన్న భూముల నుంచి 900.97 ఎకరాల్ని మినహాయించి... ఆర్‌5 జోన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తమ ప్రయోజనాల్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఆర్‌5 జోన్‌ ఏర్పాటుచేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కోర్టులో విచారణలో ఉన్నా..

మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టాన్ని సవరిస్తూ 2022 అక్టోబరు 18న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజధాని పరిధిలోని స్థానిక సంస్థల నుంచి గానీ, ఎన్నికైన పాలకమండళ్లు గానీ లేకపోతే ప్రత్యేకాధికారులు లేదా పర్సన్‌ ఇన్‌ఛార్జుల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా, లేదా ప్రభుత్వం తనంత తానుగా రాజధాని మాస్టర్‌ప్లాన్‌, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్లలో మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించింది. ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి... మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు ప్రతిపాదిస్తూ గత అక్టోబరులో ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహనిర్మాణ పథకాల కింద రాజధానిలో ఇళ్లస్థలాలు మంజూరు చేసేందుకు వీలుకల్పిస్తూ మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు ప్రతిపాదించింది. దానికి అభ్యంతరం చెబుతూ... రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులు స్టే కోరినప్పుడు... కోర్టుకు తెలియజేయకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వబోమని, ఆ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందని తెలిపింది. కానీ దానికి విరుద్ధంగా కేసు విచారణ పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేసింది.

రైతుల అభ్యంతరాలు బేఖాతరు

ఆర్‌5 జోన్‌ ఏర్పాటు ప్రతిపాదనను... రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. బృహత్‌ప్రణాళికలో మార్పు, చేర్పులను తాము అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో వివిధ గ్రామాల్లో ఏర్పాటుచేసిన గ్రామసభల్లోనూ సీఆర్డీఏ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అయినా పట్టించుకోకుండా... ఆర్‌5 జోన్‌ ఏర్పాటుచేస్తూ, రాజధానిలో భూ వినియోగ మార్పిడికి వీలు కల్పిస్తూ మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు చేయాలని ఈ నెల 17న జరిగిన సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

ఐదు గ్రామాల పరిధిలో..

రాజధాని బృహత్‌ ప్రణాళికలోని రిజర్వు జోన్‌ (యూ1), రీజినల్‌ సెంటర్‌ జోన్‌ (సి5), కాలుష్యరహిత పరిశ్రమల జోన్‌ (13), టౌన్‌సెంటర్‌ జోన్‌ (సి4), ఎడ్యుకేషన్‌ జోన్‌ (ఎస్‌2), బిజినెస్‌ పార్క్‌ జోన్‌ (11), నైబర్‌హుడ్‌ సెంటర్‌ జోన్‌ (సి3)లుగా వర్గీకరించిన భూముల్లోని 900.97 ఎకరాల్లో ఆర్‌5 జోన్‌ ఏర్పాటుచేశారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాలతో పాటు తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఈ జోన్‌ విస్తరించి ఉంది.

రైతుల అభ్యంతరాలు ఇవీ..

‘సీఆర్డీఏ చట్టం ప్రకారం భూమి ఇచ్చిన రైతులు కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వాములే. ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల వరకు మాస్టర్‌ప్లాన్‌ను మార్చడానికి వీల్లేదు. తర్వాత కూడా రైతుల అంగీకారంతోనే సవరణలు చేయాలి. మేం సమ్మతించకుండా ఎలా మారుస్తారు? పైగా పంచాయతీ ప్రత్యేకాధికారులకు ప్లాన్‌పై హక్కులు, అధికారాలు ఉండవు. వారి ప్రతిపాదనల ఆధారంగా సీఆర్డీఏ ఎలా నిర్ణయం తీసుకుంటుంది? రాజధానిలోని పేదలకు ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని మాస్టర్‌ప్లాన్‌లోనే రిజర్వు చేసి ఉంచారు. అమరావతి ప్రాంతంలోని నిరుపేదలను గాలికొదిలేసి, ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్థలాలు కేటాయిస్తామనడం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన టిడ్కో ఇళ్లను ఇంకా పేదలకు కేటాయించకుండా ఎందుకు పాడుపెడుతున్నారు? ప్రతిపాదిత ఆర్‌5 జోన్‌లో గతంలో పరిశ్రమలకు కేటాయించిన స్థలాలున్నాయి. ప్రభుత్వచర్య కారణంగా ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయి’ అని రాజధాని రైతులు చెబుతున్నారు.

న్యాయ పోరాటం చేస్తాం

సీఆర్డీఏ తమ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని మండిపడుతున్నారు. దీనిపై హైకోర్టులో వ్యాజ్యం వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి గతంలో వేసిన కేసులో... బృహత్‌ ప్రణాళికకు ఏకపక్ష సవరణలు చెల్లవని హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చిందని, దానికి విరుద్ధంగా ప్రణాళికలో లేని కొత్త జోన్‌ను ఏర్పాటుచేయడం కోర్టుతీర్పును ధిక్కరించడమేనని రైతులు అంటున్నారు. చట్టవిరుద్ధంగా దొడ్డిదారి సవరణలు సరికాదని, న్యాయం తమవైపే ఉందని రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు పువ్వాడ సుధాకర్‌ పేర్కొన్నారు.


గ్రామాల వారీగా కొత్త జోన్‌కు కేటాయించిన భూముల వివరాలు..

కృష్ణాయపాలెం: యూ1 జోన్‌లోని ఏడు సర్వే నంబర్లలో 10.18 ఎకరాలు. సి5 జోన్‌లోని 26 సర్వే నంబర్లలో 62.45 ఎకరాలు

నిడమర్రు: కాలుష్యరహిత పరిశ్రమల జోన్‌లోని ఏడు ప్రాంతాల్లో 196.2, 87.82, 12.13, 54.35, 95.09, 82.18, 142.56 ఎకరాల చొప్పున కేటాయింపు.

కురగల్లు: టౌన్‌సెంటర్‌ జోన్‌, ఎడ్యుకేషన్‌ జోన్లలోని మూడు ప్రాంతాల్లో 12.44, 12.96, 12.91 ఎకరాలు

మందడం: బిజినెస్‌ పార్క్‌ జోన్‌, టౌన్‌సెంటర్‌ జోన్‌, నైబర్‌హుడ్‌ జోన్‌, ఎడ్యుకేషన్‌ జోన్లలోని నాలుగు చోట్ల 10, 17.02, 9.11, 10.32 ఎకరాల చొప్పున ఇచ్చారు.

ఐనవోలు: బిజినెస్‌ పార్క్‌ సెంటర్‌ జోన్‌, ఎడ్యుకేషన్‌ జోన్లలోని రెండు ప్రాంతాల్లో 1.48, 51.67 ఎకరాల చొప్పున కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని