వారానికి 3 రోజులు రాగి జావ

‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. ఇప్పటికే రోజుకో రకమైన ఆహార పదార్థాలు ఉండేలా మెనూను అమలు చేస్తున్నామని, రాగి జావనూ అందిస్తూ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Published : 22 Mar 2023 07:41 IST

రాష్ట్రంలో 38 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం
కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. ఇప్పటికే రోజుకో రకమైన ఆహార పదార్థాలు ఉండేలా మెనూను అమలు చేస్తున్నామని, రాగి జావనూ అందిస్తూ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రాగి జావతో పిల్లల్లో ఐరన్‌, కాల్షియం పెరుగుతుంది. 38 లక్షల విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథకానికి ఏడాదికి రూ.450 కోట్లూ ఖర్చు చేసేవారు కాదు. వండిపెట్టే ఆయాలకు రూ.వెయ్యి ఇస్తూ అది కూడా 8-10 నెలలు బకాయిలు పెట్టే వారు. అలాంటి అధ్వాన పరిస్థితుల నుంచి రోజుకో రకమైన మెనూతో ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని పూర్తిగా మార్పు చేశాం. ప్రస్తుతం ఏడాదికి రూ.1,824 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి.. పిల్లలు ఏం తింటున్నారు? మెనూ ఏంటి? అని గతంలో ఎప్పుడూ ఆలోచించ లేదు. పిల్లలకు మంచి మేనమామలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వారంలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు అందిస్తున్నాం. వారంలో 3 రోజులు చిక్కీ, మిగతా 3 రోజులు రాగి జావ ఇస్తాం. రాగి జావ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వాములు కావడం మంచి పరిణామం. ఏడాదికి మొత్తం రూ.86 కోట్లు ఖర్చవుతుండగా.. ఇందులో సత్యసాయి ట్రస్టు రూ.42 కోట్లు భరిస్తుంది’’ అని పేర్కొన్నారు. అనంతరం శ్రీసత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ మాట్లాడుతూ.. రాగి జావ అందించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని