పైరు.. కన్నీరు

ఈదురుగాలులు.. వడగళ్లు.. భారీవర్షాలతో రైతన్న వెన్ను విరిగింది. వారం, పదిరోజుల్లో పంట చేతికొస్తుందనే దశలో.. పంట మొత్తం నేలపాలైంది.

Published : 22 Mar 2023 05:47 IST

భారీవర్షాలు, గాలులతో వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
అన్నదాతలకు తీరని కష్టం
నష్టం నమోదులో సర్కారు వింత లెక్కలు
పల్నాడు జిల్లా నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

దురుగాలులు.. వడగళ్లు.. భారీవర్షాలతో రైతన్న వెన్ను విరిగింది. వారం, పదిరోజుల్లో పంట చేతికొస్తుందనే దశలో.. పంట మొత్తం నేలపాలైంది. గత నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. ఇందులో పల్నాడు జిల్లాలో మొక్కజొన్న, మిరప, వరి, కంది తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయారు. అయినా ప్రభుత్వం మాత్రం పంటనష్టం అంచనాలు ఎలా తగ్గించాలి, ఏ మెలికలు పెట్టాలని ఆలోచిస్తోందే తప్ప రైతు కష్టాన్ని పట్టించుకోవడం లేదు. మొక్కజొన్న నేలమట్టమైనట్లు కళ్లెదుటే కనిపిస్తున్నా... సగానికి విరిగితేనే పంటనష్టంగా రాస్తామంటున్నారని మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన ‘ఈనాడు’ ప్రతినిధి వద్ద స్థానిక రైతులు గోడు వెల్లబోసుకున్నారు...
నల్లతామర ప్రభావంతో ఈ ఏడాది రైతులు ఎకరా మిరప సాగుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. అయినా ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఘనమే. తొలికోతలో తాలు కాయ అధికంగా వచ్చింది. రెండో కోతలో తాలు తక్కువగా ఉందని.. క్వింటాల్‌ రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ధర పలుకుతుందని ఆశించారు. అకాల వర్షం, గాలులతో తోటల్లోని కాయ నేల రాలింది. అదంతా తాలుగా మారే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు. కోతదశలో ఉన్న మిరప కొన్నిచోట్ల పూర్తిగా నేలపై పడిపోయింది. కల్లాల్లో ఆరబెట్టిన మిరపపై టార్పాలిన్లు కప్పినా.. కింద నుంచి నీరు చేరింది. నెమ్ము రావడంతో... కాయ తాలుగా మారుతోంది. వర్షాల వల్ల సగటున ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్లు దెబ్బతింది. నాణ్యమైన కాయ కాస్తా తాలు కాయ కింద రూ.10 వేలకు అమ్ముకోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నారు.

పల్నాడు జిల్లాతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట దెబ్బతింది. వేర్లు సహా నేలపై పడిపోయింది. అయినా అధికారులు మాత్రం సగానికి విరిగి పడితేనే లెక్కలోకి తీసుకుంటామంటున్నారని రైతులు వాపోతున్నారు. కింద పడిపోయిన వాటిని కోయించుకోవచ్చని, అవసరమైతే పోషకాలు అందుతాయనే భాష్యం చెబుతున్నారు.

వాస్తవానికి పడిపోయిన మొక్కజొన్నలో గింజ ఇంకా పాలు పోసుకోలేదు. రెండు, మూడు రోజుల పాటు వానలు కురవడంతో కండె లోపలకు నీరు చేరి బూజు పడుతోంది. క్రమంగా కుళ్లిపోతుందని రైతులు చెబుతున్నారు. కండె పూర్తిగా ఏర్పడిన పొలంలో కోత కోయించాలన్నా ఎకరాకు సాధారణం కంటే రూ.10 వేలు అధికంగా అవుతుంది. అధికారులు ఇవన్నీ పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.

కొన్నిచోట్ల కండె నీటిలో నానడంతో మొలకలు వస్తున్నాయి. అయినా అధికారులు దాన్నీ పంటనష్టంగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

వర్షాలతో రాష్ట్రంలో మొక్కజొన్నకు అపారనష్టం వాటిల్లింది. రబీలో 4.97 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ణయించగా... 5.90 లక్షల ఎకరాల్లో వేశారు. ఉదాహరణకు పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలోనే సుమారు 1,500 ఎకరాల వరకు నేలవాలింది. కౌలుతో కలిపితే ఎకరాకు రూ.35 వేల నష్టం వాటిల్లింది.


11 బస్తాలు పోతేనే నష్టం లెక్కలోకి

రైతులు ఎకరాకు 8 బస్తాలపైనే ధాన్యం దిగుబడి నష్టపోయామని వాపోతున్నా.. అధికారులు మాత్రం 33% నష్టం లెక్కన ఎకరాకు 11 బస్తాలు పంటనష్టం ఉంటేనే లెక్కల్లో రాస్తామని చెబుతున్నారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. భారీ వర్షాలకు పల్నాడు జిల్లా నకరికల్లు, రాజుపాలెం మండలాల్లో పలు చోట్ల కోత దశలో ఉన్న వరికి భారీ నష్టం వాటిల్లింది. గింజ రాలిపోయి కనిపిస్తున్నా, కోత సమయంలో మరింత నష్టం ఉంటుందనే విషయంపై వ్యవసాయ అధికారులకు అవగాహన ఉన్నా లెక్కల్లోకి తీసుకోవడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు.


ఎకరాకు రూ.50 వేలకు పైగా నష్టం

పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఎనిమిదెకరాల్లో మిరప వేశారు. తొలి కోత 2 రోజుల కిందటే మొదలు పెట్టారు. పొలంలో ఉంటే గాలికి కాయలు రాలిపోయాయి. తాలుగా మారాయి. ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్ల మేర లెక్క చూసినా రూ.50 వేల నుంచి రూ.60 వేల నష్టం వచ్చింది. కల్లంలో ఆరబెట్టిన కాయలకూ ఎకరానికి రూ.30 వేల వరకు నష్టమే.. తడిసిన కాయలు కావడంతో ధర  తగ్గిస్తారని ఆందోళన వెలిబుచ్చారు.


తోటంతా నేలమట్టం

ల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లికి చెందిన పంగులూరి శ్రీనివాసరావు రెండెరాల పొలంలో మిరపసాగు చేస్తే రూ.6లక్షల వరకు పెట్టుబడి అయింది. ‘మొక్క రూ.1.50 చొప్పున 30 వేలు కొనుగోలు చేసి నాటాం. నల్లతామర పురుగుకు రోజుమార్చి రోజు పురుగుమందులు కొట్టాం. ఒక్కో దఫా పిచికారీకే రూ.3 వేల నుంచి రూ.3,500 ఖర్చయింది. కాపు బాగానే ఉంది, ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు వస్తుందని ఆశపడ్డాం. ఇంతలో ఈదురుగాలి, వానకు తోటంతా నేలవాలింది. ఇక అంతా తాలుకాయే అవుతుంది. క్వింటాల్‌ రూ.20వేలు అమ్మాల్సిన కాయ రూ.10వేలకు కూడా కొనరు. కోత కోయాలన్నా ఖర్చు ఎక్కువే’ అని ఆయన వాపోయారు.  


రూ.3.24 లక్షల ధాన్యం పోయినట్లే

కరికల్లు మండలం నరశింగపాడు గ్రామానికి చెందిన మూల తిరుపతిరెడ్డి.. 18 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి వడగళ్ల వానకు దెబ్బతింది. గింజలు రాలిపోయాయి. ఎకరానికి రూ.18 వేల చొప్పున 18 ఎకరాలకు చూస్తే రూ.3.24 లక్షల నష్టం వస్తుందని ఆయన వాపోయారు. ‘ఇప్పటికే కొంత గింజ రాలిపోయింది. కోత సమయంలో మరింత రాలిపోయే అవకాశం ఉంది. ఎకరానికి 8 నుంచి 10 బస్తాల పంట పోయినట్లే. ఇదే పొలంలో పోయినేడాది ఎకరాకు 46 బస్తాల ధాన్యం వచ్చింది’ అని పేర్కొన్నారు.


పచ్చిగింజకు బూజు...

ల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన మొగిలిచర్ల నాగేశ్వరరావు రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరా రూ.20 వేల చొప్పున కౌలుకు తీసుకుని సాగు చేయడంతోపాటు రూ.30 వేల వరకు పెట్టుబడిగా పెట్టారు. మొత్తంగా రూ.70వేల వరకు ఖర్చయింది. పంట చేతికొస్తుందనే సమయంలో వర్షం విరుచుకుపడింది. తోటంతా నేలమట్టమైంది. ‘కండె బిగియలేదు. లోపల పచ్చిగింజ బూజు వేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వ్యవసాయ అధికారులు వచ్చి చూసి వెళ్లారు’ అని వివరించారు.


వెన్ను విరిగిన మునగరైతు

ల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం గ్రామంలో వడ్లమూడి శ్రీనివాసరావు.. మునగతోట వేస్తే వ్యవసాయం, విత్తనం, ఇతర ఖర్చులు కలిపితే రూ.50 వేల వరకు ఖర్చయింది. కాయ పడే సమయంలో అధిక వేగంతో వీచిన గాలులు చుట్టేశాయి. అధికశాతం చెట్లు విరిగిపడ్డాయి. పంటంతా పోయిందనే ఆవేదన ఆయనలో వ్యక్తమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు