ఆర్థిక అభివృద్ధి... పెట్టుబడుల ఆకర్షణ

రాష్ట్ర ప్రభుత్వం 2023-27 వరకు నాలుగేళ్ల పాటు అమల్లో ఉండేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2020లో మూడేళ్లకు ప్రకటించిన పారిశ్రామిక విధానం మార్చితో ముగియనుంది.

Published : 22 Mar 2023 05:46 IST

కొత్త పారిశ్రామిక విధానం లక్ష్యాలివే...
2023 నుంచి 2027 వరకు అమల్లో
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2023-27 వరకు నాలుగేళ్ల పాటు అమల్లో ఉండేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2020లో మూడేళ్లకు ప్రకటించిన పారిశ్రామిక విధానం మార్చితో ముగియనుంది. కొత్త పాలసీ వచ్చే ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుంది. టెక్స్‌టైల్‌ రంగానికీ ఇదే విధానం వర్తిస్తుంది. గతంలో మాదిరే ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక పెట్టుబడులను ప్రోత్సహించడం.. ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు.. భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే పాలసీ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నది ప్రధాన లక్ష్యం. దీనిద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు... ఈ రంగంలో కొత్త వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ఆలోచన. రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్స్‌, స్టార్టప్‌ వెంచర్స్‌ వంటి విధానాలకు ప్రోత్సహిస్తాం. మూడు పారిశ్రామిక కారిడార్‌ల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్‌ హబ్స్‌ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం. దీంతోపాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కులు, పీపీపీ విధానంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తాం. ఫార్మారంగం, బల్క్‌డ్రగ్స్‌, టెక్స్‌టైల్స్‌తో పాటు 12 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ప్రాధాన్యంగా ఎంచుకున్నాం’ అని ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూముల కోసం దరఖాస్తు అందినప్పటి నుంచి 21 రోజుల్లో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ) కేటాయిస్తుందని పేర్కొంది. ఏపీఐఐసీ 530 పారిశ్రామిక టౌన్‌షిప్‌లు, 5 ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేసిందని.. పరిశ్రమలకు కేటాయించడానికి ఇంకా 46,506 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. పరిశ్రమ ఏర్పాటు చేసి.. వాణిజ్య ఉత్పత్తిలోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తామని, 33/66 ఎకరాలను లీజు విధానంలో కేటాయిస్తామని తెలిపింది. పాత పాలసీలో ఎలాంటి మార్పులు.. పరిశ్రమల ఆకర్షణకు ప్రత్యేక ప్రోత్సాహకాలు లేకుండానే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు