ప్రధాన ఆలయాల ప్రచార రథాలతో హిందూ ధర్మప్రచారం

రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల ప్రచార రథాలతో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

Updated : 22 Mar 2023 06:37 IST

ధార్మిక పరిషత్‌ సమావేశంలో నిర్ణయం
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల ప్రచార రథాలతో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్ర ధార్మిక పరిషత్‌ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు పెంపొందించడం, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రచార రథాలు ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఎప్పుడు వెళ్లనున్నాయనేది ముందుగానే తెలియజేసి, అక్కడి ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మికవేత్తలు తదితరులను భాగస్వాములను చేయాలని సూచించారు. రాష్ట్ర శ్రేయోభివృద్ధి లక్ష్యంగా విజయవాడలో లక్ష్మీ సుదర్శన రాజశ్యామల సుదర్శన సహిత మహాలక్ష్మి యాగం నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి  కొట్టు సత్యనారాయణ చెప్పారు. దీనిపై ఆగమ, జోతిష్య పండితులతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పెద్ద జియంగార్‌ పీఠాధిపతి,    పుష్పగిరి పీఠాధిపతి, తితిదే ఈవో పలు సూచనలు చేశారు. అర్చకులకు, వివిధ ట్రస్ట్‌ బోర్డుల సభ్యులకు, కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల్లో చేరిన వారికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ముఖ్యకార్యదర్శి హరిజవహర్‌లాల్‌, ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని