తితిదే బడ్జెట్‌ రూ.4,411.68 కోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం 2023-24 వార్షిక బడ్జెట్‌ను రూ.4,411.68 కోట్లతో ధర్మకర్తల మండలి ఇటీవల ఆమోదించింది. ఇందులో అత్యధికంగా హుండీ ద్వారానే సుమారు రూ.1,591 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది.

Updated : 22 Mar 2023 06:42 IST

హుండీ ద్వారా రూ.1,591 కోట్ల అంచనా

ఈనాడు, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం 2023-24 వార్షిక బడ్జెట్‌ను రూ.4,411.68 కోట్లతో ధర్మకర్తల మండలి ఇటీవల ఆమోదించింది. ఇందులో అత్యధికంగా హుండీ ద్వారానే సుమారు రూ.1,591 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది. కొవిడ్‌ తర్వాత హుండీ ఆదాయం భారీగా పెరిగి రోజుకు సరాసరి రూ.4.42 కోట్ల వరకు వస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఇదే స్థాయిలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2022-23 బడ్జెట్‌తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,315.28 కోట్ల మేర బడ్జెట్‌ పెరిగింది. ఇందులో ఉద్యోగులు, పొరుగు, ఒప్పంద సేవల సిబ్బంది జీతభత్యాలకు రూ.1,532 కోట్లు వెచ్చించనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.690.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. కార్పస్‌, ఇతర పెట్టుబడుల కోసం రూ.600 కోట్లను పొందుపర్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.291.85 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తితిదే ఇటీవల కొన్ని వసతి గదులతోపాటు కల్యాణ మండపాల అద్దె పెంచడం వల్ల రానున్న ఏడాదిలో ఆదాయం పెరగనుంది. ప్రస్తుత సంవత్సరం వసతి, కల్యాణ మండపాల ద్వారా రూ.118 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.129 కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పొందుపర్చారు.

పెరిగిన వడ్డీ ఆదాయం

తితిదే వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్లు వస్తుందని అంచనా వేశారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.990 కోట్లు వస్తుందని భావిస్తున్నారు. అంటే వడ్డీ ద్వారా ఇప్పుడు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏకంగా రూ.177 కోట్లు ఎక్కువ వస్తాయని భావిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి తొలుత రూ.3,096.40 కోట్లతో బడ్జెట్‌ అంచనాలు రూపొందించారు. సవరించిన అంచనాల మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) పూర్తయ్యేనాటికి రూ.4,385.25 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. హుండీద్వారా సుమారు రూ.వెయ్యి కోట్లు వస్తాయనుకుంటే సవరించిన అంచనాల మేరకు ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి రూ.1,613 కోట్లు వస్తాయని పొందుపర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు