సంక్షిప్త వార్తలు (8)

అవును.. ఈ మొక్క ధర చూస్తే ‘మొక్కే బంగారమాయే’ అనిపిస్తుంది. దాని పూలు మాత్రం బంగారు వర్ణంలో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గోల్డ్‌ఛైన్‌గా పిలిచే ఈ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కనిపించాయి.

Updated : 22 Mar 2023 06:30 IST

మొక్కే బంగారమాయే!

వును.. ఈ మొక్క ధర చూస్తే ‘మొక్కే బంగారమాయే’ అనిపిస్తుంది. దాని పూలు మాత్రం బంగారు వర్ణంలో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గోల్డ్‌ఛైన్‌గా పిలిచే ఈ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కనిపించాయి. బుర్రిలంకలోని ఓ నర్సరీ నిర్వాహకుడు థాయిలాండ్‌ నుంచి వీటిని తెప్పించి స్థానికంగా అభివృద్ధి చేశారు. 6 నుంచి 7 అడుగుల ఎత్తు పెరిగిన మొక్క అడుగున్నర పొడవు బంగారు వర్ణంలో పూలు పూస్తోంది. వీటిని ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చని నర్సరీ నిర్వాహకుడు తెలిపారు. ధర సుమారు రూ.60వేల నుంచి రూ.70 వేల వరకు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, కడియం


రాష్ట్రంలో 218 మంది వైద్యుల నియామకం

ఆరోగ్య విశ్వవిద్యాలయం(విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 285 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టులకు సంబంధించి మంగళవారం వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్‌లో 218 మందికి నియామక పత్రాలను అందించారు. రాష్ట్రంలో 134 ఖాళీలతో పాటు కొత్తగా ఏర్పడిన పీహెచ్‌సీల్లో 88, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 63 వైద్యుల పోస్టులకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. నియామక పత్రాలు అందుకున్న వారంతా వారం వ్యవధిలో ఆయా కేంద్రాల్లో చేరాల్సి ఉంటుందని డైరెక్టర్‌ ఫర్‌ హెల్త్‌ రామిరెడ్డి తెలిపారు. వైద్య విభాగంలోని డిప్యూటీ డైరెక్టర్లు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు.


రాష్ట్ర వక్ఫ్‌ నిబంధనల్లో మార్పులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీ వక్ఫ్‌ చట్టం-2000లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. వక్ఫ్‌ ట్రైబ్యునల్‌కు ఇప్పటివరకు ప్రిసైడింగ్‌ అధికారి ఒక్కరే ఉండగా.. తాజాగా ముగ్గురిని నియమించే వెసులుబాటు కల్పించింది. వారి హోదాలనూ మార్చింది. ట్రైబ్యునల్‌కు ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించుకునే అధికారం కల్పించింది. వారి జీతభత్యాల చెల్లింపు విధివిధానాలను రూపొందించింది. వక్ఫ్‌బోర్డులో సిబ్బంది నియామకానికి సంబంధించిన నిబంధనల్లో సవరణలు చేసింది. ఇప్పటివరకు పాలకమండలి నిర్ణయం మేరకు సిబ్బంది జీతభత్యాలు నిర్ణయిస్తుండగా, ఇప్పుడు కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ ఉత్తర్వులిచ్చారు.


ప్రభుత్వానికి విన్నపాల ద్వారా సీపీఎస్‌ ఉద్యోగుల నిరసన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాల ద్వారా నిరసన తెలియజేయాలని ఏపీ సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. ఈనెల 23న తమ శాఖల కార్యదర్శులకు వారు విన్నపాలు అందించనున్నారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శికి విన్నపాలను ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3లక్షల సీపీఎస్‌ ఉద్యోగుల జీతాలనుంచి ప్రతి నెలా 10శాతం మినహాయిస్తున్నా.. దీన్ని సీపీఎస్‌ ప్రాన్‌ ఖాతాకు జమ చేయడం లేదని వారు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 90శాతం జీతం ఇచ్చి ఆదాయపు పన్ను మాత్రం మొత్తం వేతనానికి వసూలు చేశారని సీపీఎస్‌ ఉద్యోగులు వాపోతున్నారు.


‘అంగన్‌వాడీలకు ఫిబ్రవరి వరకు వేతనాలు చెల్లించాం’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు 2023 ఫిబ్రవరి వరకు వేతనాలు చెల్లించామని మహిళాశిశు సంక్షేమశాఖ సంచాలకులు రవి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. 2022-23 ఏడాదికి ఇప్పటివరకు వారి గౌరవ వేతనానికి రూ.1,019 కోట్లు ఖర్చు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 అదనంగా చెల్లిస్తున్నామన్నారు.


రాంగోపాల్‌వర్మపై మహిళా న్యాయవాదుల ఫిర్యాదు

పెదకాకాని, న్యూస్‌టుడే: మహిళల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై గుంటూరు బార్‌ అసోసియేషన్‌కి చెందిన మహిళా న్యాయవాదులు మంగళవారం పెదకాకాని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు యువతను నేరప్రవృత్తి వైపు ప్రోత్సహించేలా ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనను ఆహ్వానించిన వీసీపై సైతం చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎం.నాగలక్ష్మి, జి.పద్మావతి, సుప్రియ, అనూరాధ, తులసి, కల్యాణి, తదితరులు ఉన్నారు. సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యురాలు జి.వరలక్ష్మి ఇదే ఘటనకు సంబంధించి రాంగోపాల్‌వర్మ, వీసీలపై పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


రూ.1,760 కోట్ల అప్పును సమీకరించిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1,760 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ.వెయ్యి కోట్ల మొత్తాన్ని తొమ్మిదేళ్ల కాలపరిమితితో 7.73శాతం వడ్డీతో చెల్లించేలా తీసుకున్నారు. మరో రూ.760 కోట్లను ఏడేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7.70శాతం వడ్డీకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి ప్రభుత్వం రుణాలు తీసుకుంది.


ఇగ్నో కోర్సుల్లో ప్రవేశాలకు గడువు 27 వరకు పొడిగింపు

జియాగూడ, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు చివరి తేదీని ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఆ సంస్థ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు రమేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోర్సులలో ప్రవేశం పొందడానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తులు, పూర్తి వివరాలకు ఇగ్నో వెబ్‌సైట్‌ www.ignou.ac.in, లేదా rchyderabad@ignou.ac.in మెయిల్‌ ఐడీలో లేదా 9492451812లో సంప్రదించాల్సిందిగా సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు