ఏపీలో నివాస గృహాలపై సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర సాయం

నివాస గృహాలపై సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు 2019-20 నుంచి 2023 మార్చి 15 వరకు రెండు విడతల్లో కేంద్ర ఆర్థిక సహాయం కింద రూ.6.87 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు.

Published : 22 Mar 2023 05:39 IST

విద్యుత్‌ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: నివాస గృహాలపై సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు 2019-20 నుంచి 2023 మార్చి 15 వరకు రెండు విడతల్లో కేంద్ర ఆర్థిక సహాయం కింద రూ.6.87 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీఈడీసీఎల్‌కు ఇన్సెంటివ్స్‌ కింద 2019-20 నుంచి ఈనెల 15 వరకు రూ.5.64 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి సోలార్‌ రూఫ్‌టాప్‌ ద్వారా 8 మెగావాట్లు ఉత్పత్తి అంచనా వేస్తుండగా ఇప్పటివరకు 3.2 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు.

పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ 17,330.91 మెగావాట్లతో 5.47 శాతం వాటా కలిగి ఉందని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద తెలంగాణలో అత్యధికంగా 50 బైక్‌ అంబులెన్స్‌లకు ఆర్థిక సహాయం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో బైక్‌ అంబులెన్స్‌ నడపాలనే యోచన ఏపీ గిరిజనశాఖకు వచ్చిందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏపీకి రూ.4.90 కోట్లు సహాయం చేసినట్లు తెలిపారు.

ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రాలు తెలంగాణలో 179, ఆంధ్రప్రదేశ్‌లో 146 ప్రారంభించినట్లు కేంద్ర రసాయనాలశాఖ సహాయ మంత్రి భగవంత్‌ కుబ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు