వడగళ్లు... రైతుకు కడగండ్లు

ఖరీఫ్‌, రబీల్లో పంటలు సాగు చేసిన రైతుల 9 నెలల కష్టాన్ని అకాల వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఈదురుగాలులు, వడగళ్లవానలకు సుమారు 16 జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Published : 23 Mar 2023 03:52 IST

నేలమట్టమైన మొక్కజొన్న
వరి రైతుల ఆశలూ ఆవిరి
భారీగా పంట నష్టం
16 జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వానల ప్రభావం
వ్యవసాయ పంటల నష్టం  రూ.400 కోట్లపైనే
ఈనాడు - అమరావతి, యంత్రాంగం

ఖరీఫ్‌, రబీల్లో పంటలు సాగు చేసిన రైతుల 9 నెలల కష్టాన్ని అకాల వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఈదురుగాలులు, వడగళ్లవానలకు సుమారు 16 జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న భారీగా దెబ్బతింది. రబీలో వేసిన ధాన్యం కోతకొచ్చిన చోట వానలకు గింజ రాలిపోతోంది. కొన్ని జిల్లాల్లో ఇంకా రైతుల ఇళ్ల వద్దే ఉన్న ఖరీఫ్‌ ధాన్యమూ ఈ వానలకు తడిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. సగటున ఎకరాకు రూ. 20 వేల లెక్కన చూసినా రైతులు దాదాపు రూ. 400 కోట్లకు పైగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు తెచ్చి సాగు చేసిన పంట నేలవాలి, నీటిలో నానుతున్న తీరు చూసి రైతు గుండె పగులుతోంది. నష్టం అంచనాల్లో ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం అంచనాలు ఎలా తగ్గించాలనే ఆలోచిస్తోంది. పంట నష్టం కళ్లెదుటే కన్పిస్తున్నా.. 33% పంట దెబ్బతినలేదంటూ సతాయిస్తోంది. రూ.లక్షల్లో నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ సొమ్ము.. విత్తనాలు, వ్యవసాయ ఖర్చులకు కూడా చాలదని.. ఆ కొద్ది మొత్తానికీ రకరకాల నిబంధనలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఉన్న వ్యవసాయ సహాయకులతో ఒకటి రెండు రోజుల్లో నష్టం అంచనాలు లెక్క కట్టొచ్చని.. నష్టాన్ని తగ్గించి చూపడానికే దాన్ని నెలాఖరు వరకు సాగదీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.


కల్లాల్లోనే తడిసిన ధాన్యం

వడగళ్ల వానలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామిడి, మెక్కజొన్న, వరి, అరటి, తమలపాకు, మినుము, పెసర పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. రైతుల దగ్గర ఇంకా 4 లక్షల టన్నుల వరకు ధాన్యం నిల్వలుండగా లక్ష టన్నుల కొనుగోలుకు అనుమతిచ్చారు. తోట్లవల్లూరు, ఉంగుటూరు, గూడూరు, అవనిగడ్డ, గుడ్లవల్లేరు మండలాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసింది. రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో వేసిన వరి, మొక్కజొన్న, జొన్న పడిపోయాయి. రెండో పంటగా వేసిన సుమారు 40 వేల ఎకరాల్లోని మినుము చేతికొచ్చే దశలో, పనలపై ఉండగా తడిసింది. ఎకరానికి దాదాపు రూ.10 వేల వరకు నష్టం వస్తుందని వాపోతున్నారు.

* ఏలూరు జిల్లాలోని టి.నరసాపురం, జీలుగుమిల్లి, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లో మొక్కజొన్న, వర్జీనియా పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయి.

* గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జొన్న, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. కండె పాలుపోసుకునే దశలో ఉన్న పంట పూర్తిగా పోయింది. వరి చేలపై వడగళ్ల ధాటికి గింజలు నేలరాలాయి.

* కాకినాడ జిల్లాలో గొల్లప్రోలు, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లో వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. నువ్వు చేలు నీట మునిగాయి.


40 ఎకరాల వరి.. నీటిలోనే

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లికి చెందిన రైతు మన్నేపల్లి శ్రీనివాసులు అల్లిమడుగు గ్రామంలో ఎకరా రూ.13 వేల చొప్పున కౌలుకు తీసుకుని 35 ఎకరాలు, సొంత పొలం 5 ఎకరాల్లో వరి వేశారు. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రెండు రోజుల్లో కోద్దామనుకుంటుండగా అకాల వర్షాలకు పంటంతా నేలవాలిపోయింది. చేలో భారీగా నిలిచిన నీటిని మూడు రోజులుగా ఇంజిన్లతో బయటకు తోడుతూనే ఉన్నారు. పంట కొంతైనా చేతికొస్తుందో లేదో తెలియడం లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని శ్రీనివాసులు కన్నీటి పర్యంతమయ్యారు.


నెల్లూరులో నేలవాలిన వరి

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు నియోజకవర్గాల్లోని 125 గ్రామాల్లో 9 వేల ఎకరాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చిన వరి పైరు వాలిపోయింది. సెనగ అధికంగా దెబ్బతింది.

* తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట వడగళ్ల వానకు నేలకొరిగింది. ధాన్యం గింజలు నేలరాలాయి. జిల్లావ్యాప్తంగా 60% వరకు కోతలు పూర్తవగా ధాన్యం తడిసిపోయింది.

* అనంతపురం జిల్లాలో 7,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, కొర్ర తదితర పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.

* ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో పత్తి, మిరప, పొగాకు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి.

* కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మిరప రైతులకు పెద్ద దెబ్బ తగిలింది. మొక్కజొన్న, ఆముదం, సజ్జ, వరి, మినుము, కొర్ర, పొద్దుతిరుగుడు, కంది తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 23 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అంచనా.

* వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో సుమారు 2,500 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మినుము, కొర్ర, జొన్న, వరి వర్షార్పణమైంది.


పొలాల్లోనే ధాన్యం, మొక్కజొన్న

ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలోనూ ఖరీఫ్‌ ధాన్యం ఇంకా లక్ష టన్నుల వరకు రైతుల దగ్గరే ఉంది. పొలాల్లో, ఇళ్ల ముందు బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసి రంగు మారుతోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. లావేరు, రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల్లో 31 వేల ఎకరాల్లో రబీ మొక్కజొన్నలో 60% మేర పొలాల్లో, కల్లాల్లో నిల్వ చేయగా.. అకాల వర్షంతో తడిసింది. టార్పాలిన్ల కింద ఉన్న పంటకు మొలకలొచ్చి, గింజలు రంగు మారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

* విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 2,200 ఎకరాల్లో మొక్కజొన్న రైతులకు నష్టమే మిగిలింది.

* అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో లంక పొగాకు, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.


మరో అయిదు రోజులు వానలే..!

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో అయిదు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పిడుగులు పడే ప్రమాదమూ ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భారీ నష్టం

చాలా చోట్ల వర్షాల కంటే ఈదురుగాలులు, వడగళ్ల వానల వల్లే తీవ్ర నష్టం తలెత్తింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కోస్తా, రాయలసీమ అంతటా అధిక శాతం జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నకు అపార నష్టం జరిగింది. మొత్తం విస్తీర్ణంలో 75% మేర పంట దెబ్బతినగా అందులో 90% పైగా రైతులు పూర్తి పంటను కోల్పోయినట్లే.


అకాల వర్షాలు ముంచేశాయి
- బావిశెట్టి సూర్యారావు, కౌలు రైతు, వన్నెపూడి, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా

రూ.25 వేలు పెట్టి ఎకరా 20 సెంట్లు కౌలుకు తీసుకున్నా. రూ.35 వేల పెట్టుబడితో  మొక్కజొన్న వేశా. పంటను రూ.60 వేలకు అడిగారు. ఇంకా ఎక్కువ ధర వస్తుందని, వారం ఆగుదామనుకున్నా. అకాల వర్షాలు, ఈదురుగాలులకు పంటంతా పోయింది.


అయిదు రోజులుగా నరకయాతన

శ్రీకాకుళం జిల్లా లావేరుకు చెందిన మజ్జి విశ్వనాథం.. రూ.48 వేలు ఖర్చు పెట్టి రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ‘రబీలో మొక్కజొన్న వేసినప్పటి నుంచీ కష్టాలే. సాగునీరందక కొంత దెబ్బతింది. మిగిలిన పంటను ఎలాగోలా కాపాడుకున్నాం. ఇప్పుడు వర్షాలకు  చేలో ఉన్న కండెలన్నీ తడిచిపోయాయి. గింజ రంగు మారుతోంది. అయిదు రోజులుగా నరకయాతన పడుతున్నాం. పెట్టుబడి పోయినట్లే’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


మొక్కజొన్న మొలకలొస్తోంది  
- మీసాల నారాయణమ్మ, రైతు, వేణుగోపాలపురం, శ్రీకాకుళం జిల్లా

మూడెకరాల్లో మొక్కజొన్న వేశాం. రెండెకరాల్లో పంట తీసి కల్లాలకు తెచ్చే సమయానికి వాన మొదలైంది. ఎకరా పంట పొలంలోనే ఉంది. రోజూ వాన కురుస్తుండటంతో పరదాల కిందనున్న పంట మొలకలు వస్తోంది. రూ.65 వేల వరకు మదుపు పెట్టాం. వర్షం ఆగకపోతే ఆశ వదులుకోవాల్సిందే.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని