తెలుగు వారికి కొత్త వెలుగు తేవాలి

‘‘శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండడానికి వాళ్లేమీ రాజులు కాదు. అయిదేళ్లు అధికారం ఇచ్చింది సుపరిపాలన చేయమని, బాధ్యతతో ప్రవర్తించమని, సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండమని.

Published : 23 Mar 2023 05:54 IST

ఉగాది వేడుకల్లో చంద్రబాబు ఆకాంక్ష
ప్రజలు ముందుగానే పంచాంగం చెప్పారని వ్యాఖ్య
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో వారి వైఖరి స్పష్టమైందని వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘‘శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండడానికి వాళ్లేమీ రాజులు కాదు. అయిదేళ్లు అధికారం ఇచ్చింది సుపరిపాలన చేయమని, బాధ్యతతో ప్రవర్తించమని, సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండమని. అయితే... వైకాపా వాళ్లు.. బెదిరింపులు, అణచివేతలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విధానం కుదరదు. ఇదే విషయాన్ని పంచాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. రాష్ట్రం కోసం పోరాడతాం...’’ అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఉగాది సందర్భంగా బుధవారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. శోభకృత్‌ నామ సంవత్సరం ప్రజా జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని ఆకాంక్షించారు. ‘‘నాలుగేళ్లుగా రాష్ట్రంలో కష్టాలు, సమస్యలే ఉన్నాయి. దుఃఖం తప్ప మరొకటి లేదు. కనీసం ఈ సంవత్సరంలోనైనా శుభం జరుగుతుందనే ఆశాభావం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజలు రాష్ట్ర భవిష్యత్తును ముందే చెప్పారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇది మాములు తీర్పు కాదు. ఎన్ని సమస్యలు సృష్టించినా, భయపెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా బెదిరేది లేదని ప్రజలు తిరుగుబాటుకు నాంది పలికారు.  నేను గత 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని అరాచకాలు ఇప్పుడు రాష్ట్రంలో చూశాను. రాజకీయపార్టీలు, ప్రశ్నించిన వారిపై, ప్రజాసంఘాలపై దాడులు విపరీతంగా పెరిగాయి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ఏపీ, తెలంగాణ సహా దేశంలో బాగా వర్షాలు పడి రైతాంగం ఆనందంగా ఉండాలి. రైతులకు గిట్టుబాటు ధర లభించి వారు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా...’ అని చంద్రబాబు చెప్పారు. రంజాన్‌ నెల ప్రారంభం సందర్భంగా ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

నష్ట నివారణను తక్షణం అంచనా వేయాలి
- సీఎస్‌కు చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన ఉద్యాన, వాణిజ్య పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తీవ్ర నష్టం ఉన్నా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బుధవారం ఆయన లేఖ రాశారు. ‘‘భారీ వర్షాలు, పిడుగుపాటు వల్ల మెట్ల సంధ్య, శ్రీవిద్య అనే మహిళలు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో  ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి, మినుము, జొన్న, అరటి, బొప్పాయి, మామిడి, టమోటా, వరి తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్‌, కర్నూలు, ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాల్లో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. పంట రుణాలను తక్షణం పునరుద్ధరించాలి. వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం, వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలి...’’ అని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు