శోభకృత్‌ శోభాయమానంగా సాగాలి

‘రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రాబోయే సంవత్సరమంతా మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

Published : 23 Mar 2023 05:55 IST

అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్‌ ఆకాంక్ష
రైతులు బాగుంటారన్న పంచాంగకర్త

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రాబోయే సంవత్సరమంతా మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలోని గోశాలలో బుధవారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో జగన్‌, ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ ప్రారంభంలో సీఎం దంపతులకు వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం జగన్‌ పంచాంగాన్ని ఆవిష్కరించి పంచాంగకర్త కప్పగంటి సుబ్బరాయ సోమయాజులుకు అందించారు. ఉద్యాన శాఖ, శిల్పారామం, ఉగాది క్యాలెండర్లనూ సీఎం ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గోశాలలో ఉగాది వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల దేవాలయాన్ని తలపించేలా సెట్‌ వేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేంకటేశ్వరస్వామి విగ్రహానికి సీఎం దంపతులు పూజ చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్నేహం పెరిగి సంతోషంగా..

పంచాంగకర్త సోమయాజులు పంచాంగం పఠించారు. ‘రాష్ట్రాధిపతి(ముఖ్యమంత్రి) రాశిఫలాల దృష్ట్యా అంతా బాగానే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య స్నేహం పెరిగి అన్యోన్యంగా ఉంటాయి. ప్రజల్లోనూ స్నేహభావం పెరిగి సంతోషం ఇనుమడిస్తుంది. పేరుకు తగ్గట్లే ఈ ఏడాదంతా శోభాయమానంగా సాగుతుంది. వ్యవసాయంపై ఆధారపడిన వారికి లాభదాయకంగా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. పాడిపరిశ్రమా బాగుంటుంది. ఉద్యోగులు, శ్రామికులకూ మంచి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా, వ్యవస్థాపరంగా అక్టోబరు దాకా ఆర్థికంగా కొన్ని చికాకులు వస్తుంటాయి. అక్టోబరు తర్వాత అంతా శుభకరమే. ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాలు బలపడతాయి. రాశి ఫలాల దృష్ట్యా సీఎం గ్రహాల బలం బాగుంది.   కాబట్టి అన్ని విషయాల్లోనూ ప్రశాంతచిత్తంతో పథకాలను ముందుకు తీసుకువెళ్లడంతోపాటు ప్రజలకు కావాల్సిన వసతులు అందించడంలో చక్కటి ప్రణాళికలు రూపొందిస్తారు. సంప్రదాయ వృత్తుల వారికి అక్టోబరు నుంచి మంచి పురోభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి రంగంలోనూ మార్పులొస్తాయి. దీనితో ముడిపడిన వ్యాపారాలన్నీ అభివృద్ధికి నోచుకుంటాయి’ అని వివరించారు. అనంతరం సీఎం దంపతులకు సోమయాజులు ఉగాది పచ్చడిని అందించారు.

ఆశీర్వచనాలు.. సత్కారాలు.. ప్రదర్శనలు..

సాంస్కృతిక శాఖ, తితిదే, దుర్గామల్లేశ్వర స్వామి ఆలయాల తరఫున ముఖ్యమంత్రి దంపతులకు వేదపండితులు పట్టు వస్త్రాలనిచ్చారు. వారిరువురికీ ఆశీర్వచనాలు అందించారు. సోమయాజులును, వేద పండితులను సీఎం సత్కరించారు. ఏపీ ప్రభుత్వ పరిపాలన సంస్కరణల పేరిట కళాకారులు నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. నాట్య విశారద అవార్డు గ్రహీత జి.పద్మజారెడ్డి నృత్యరూపక ప్రదర్శననిచ్చారు. వివిధ టీవీ ఛానెళ్లలో పాటల పోటీల్లో విజేతలైన బాల గాయకులు మయూక్‌ వెలగపూడి, సాయివేద వాగ్దేవి... గీతాలను ఆలపించారు. ఆనందసాయి బృందం ఉగాది ప్రత్యేకగీతంతో పాటు నృత్య ప్రదర్శనలిచ్చింది. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలి
- సీఎం జగన్‌ ట్వీట్‌

ఉగాది సందర్భంగా సీఎం జగన్‌... ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత్‌ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని