నీళ్లు లేవంటూనే ‘పెద్దలకు’ ధారపోస్తున్నారు!
జగన్ ప్రభుత్వానికి అన్నదాతల కన్నా అయినవారి ప్రయోజనాలే ఎక్కువయ్యాయి. జలాశయాల్లో నీళ్లు లేకపోయినా తమ ‘పవర్’తో జలవిద్యుత్తు ప్రాజెక్టులకు నీళ్లు ధారాదత్తం చేస్తున్నారు.
అదానీ, షిర్డీసాయి విద్యుత్తు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు
హైడ్రో విద్యుత్తు ప్రాజెక్టులతో జలాశయాలకు జలగండమేనని జలవనరులశాఖ అధికారుల నివేదికలు..
అయినా కొన్ని నిబంధనలతో నీరిచ్చేందుకు సుముఖత
అన్నదాతల కన్నా అయినవాళ్ల ప్రయోజనాలకే ప్రాధాన్యం
ఈనాడు డిజిటల్ - అనకాపల్లి
జగన్ ప్రభుత్వానికి అన్నదాతల కన్నా అయినవారి ప్రయోజనాలే ఎక్కువయ్యాయి. జలాశయాల్లో నీళ్లు లేకపోయినా తమ ‘పవర్’తో జలవిద్యుత్తు ప్రాజెక్టులకు నీళ్లు ధారాదత్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, కాకినాడ జిల్లాల్లో అసలే అవి వెనుకబడ్డ ప్రాంతాలు. కొన్ని గిరిజన పల్లెలు, మరికొన్ని మెట్టప్రాంతాలు. అక్కడి ఆయకట్టు సాగు చేయాలన్నా, పొలాలు పండాలన్నా, తాగునీరు అందించాలన్నా తాండవ, రైవాడ జలాశయాలే దిక్కు. ఆ రెండు జలాశయాలకు వచ్చే నీళ్లే తక్కువ. చచ్చీచెడీ సాగు అయ్యే భూమి మొత్తం 66,809 ఎకరాలు. ఆ కొద్ది భూమికీ నీళ్లు ఇవ్వడమే కష్టం. అసలే సాగునష్టాలు, తాగునీటి కష్టాలు. తాండవ జలాశయానికి మొత్తం 33 ఏళ్లలో 15 ఏళ్ల పాటు నీళ్లే ఉండవని జలవనరులశాఖ అధికారులే తేల్చేశారు. రైవాడకూ నీటిలభ్యత అంతంతే. అంత కరవు ఉన్నా... సీఎం జగన్‌కు సన్నిహితులైన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వారి జలవిద్యుత్ ప్రాజెక్టుకు, కడప జిల్లాకే చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు వెయ్యి మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తికి అవసరమయ్యేలా నీళ్ల కేటాయింపులు ఇచ్చేశారు. వీటికి నీళ్లిస్తే దిగువన ఉన్న తాండవ, రైవాడ జలాశయాలకు నీళ్లు రావడం కష్టమేనని స్థానిక జలవనరులశాఖ అధికారులు నివేదికలో తేల్చిచెప్పారు. అలా చెబుతూనే... కొన్ని షరతులతో నీళ్లు ఇవ్వవచ్చని చివర్లో వక్కాణించారు. అంత పెద్ద పారిశ్రామికవేత్తల విషయంలో దిగువస్థాయి చిన్న ఇంజినీర్లు ఆ నిబంధనలను కఠినంగా అమలుచేసే పరిస్థితులు ఉంటాయా అని జలవనరులశాఖ అధికారులే తిరిగి ప్రశ్నిస్తున్నారు. ‘‘మా ఇంజినీర్లు ఎప్పుడు మీ ప్లాంటులోకి వస్తామన్నా అనుమతించాలి’’ అని జలవనరులశాఖ కార్యదర్శి ఇచ్చిన జీవోలోనే పారిశ్రామికవేత్తలకు విన్నవించారంటే వాస్తవంలో ఆ పరిస్థితికి ఆస్కారం ఉంటుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రానికి విద్యుత్తు ఉత్పత్తి అవసరమే. రాష్ట్రంలో అనేకచోట్ల ఇలాంటి ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తున్నారు.
నీటి కరవు లేనిచోట విద్యుత్తు ఉత్పత్తిచేస్తే ఎవరూ ప్రశ్నించరు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగుకు, తాగునీటికి కొరత ఉందంటూనే విద్యుత్తు ఉత్పత్తికి నీళ్లు కేటాయించడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆ రెండు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోటలో స్థానిక గెడ్డపై (వాగు) వెయ్యి మెగావాట్ల పంప్డు స్టోరేజి ప్రాజెక్టు ఏర్పాటుకు 0.393 టీఎంసీలు నీరు ఒకసారికి, 0.016 టీఎంసీల నీళ్లు ప్రతి ఏటా ఆవిరి రూపంలో నష్టపోయే నీటిని భర్తీచేసేలా ఇచ్చేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు జలవనరులశాఖ కొన్ని షరతులతో అనుమతులిచ్చింది. ఇదే జిల్లాలోని చింతపల్లి మండలం ఎర్రవరం గ్రామం వద్ద శ్రీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు బొడ్డేరు వాగు నుంచి 0.533 టీఎంసీలు ఒకసారి, ఆవిరి రూపంలో నష్టపోయే 0.046 టీఎంసీలు ప్రతి ఏటా మళ్లీ భర్తీచేసేందుకు వీలుకల్పిస్తూ కొన్ని షరతులతో నీళ్లిచ్చేలా జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు.
తాండవ రైతులకు జలాఘాతమే
తాండవ జలాశయం కింద నాతవరం, కోటవురట్ల మండలాలతో పాటు కాకినాడ జిల్లాకు చెందిన రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాల్లో సుమారు 51,465 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయానికి ప్రధాన నీటివనరైన బొడ్డేరు వాగుపైనే ఇప్పుడు కడప జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ వెయ్యి మెగావాట్ల పంప్డ్‌స్టోరేజి ప్రాజెక్టు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. చింతపల్లి మండలం సమీపంలోని ఎర్రవరం వద్ద విద్యుత్తు ఉత్పత్తికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించనుంది. ఇందుకోసం 0.533 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది. అంతకుముందే సంబంధితశాఖ నుంచి నిరంభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందేందుకు వీలుగా నీటి లభ్యతపై సర్వే చేపట్టారు. ఇందుకు సంబంధించి జలవనరులశాఖ అధికారులు ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికల్లో ఏం ఉందంటే..
* ప్రస్తుతం శ్రీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నిర్మించ తలపెట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టు సాగి సత్యనారాయణరాజు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం పరిధిలోకి వస్తుంది.
* బొడ్డేరు వాగు (తాండవ)పై అనకాపల్లి జిల్లా గంటావారి కొత్తగూడెం వద్ద తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ జలాశయం వల్ల 51,468 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అనకాపల్లి జిల్లాలోనే ఇదో ప్రధాన ప్రాజెక్టు. ఈ రిజర్వాయర్‌కు నీళ్లు లేవనే ఉద్దేశంతో ఏలేరు-తాండవ అనుసంధాన ప్రాజెక్టుకు రూ.470.05 కోట్లతో ప్రస్తుత ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. సీఎం జగన్ 2022 డిసెంబరు 30న శంకుస్థాపన చేశారు.
* తాండవ జలాశయానికి దారగడ్డ, బొడ్డేరు నుంచి నీళ్లు వస్తాయి. దీనికి బొడ్డేరు ప్రధాన వనరు. ప్రస్తుతం షిర్డీసాయి పంప్డు స్టోరేజి ప్లాంటు బొడ్డేరుపైనే నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎర్రవరం వద్ద ఎగువ, దిగువ రెండు జలాశయాలు చెరో 0.533 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ డీపీఆర్‌లో పేర్కొంది. ఆ తర్వాత ఉత్తర్వుల్లో 0.533 టీఎంసీలు ఒకసారి, 0.046 టీఎంసీలు ప్రతి ఏటా ఇచ్చేందుకు వీలుకల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.
రైవాడ పైనా ప్రభావం..
అదానీ గ్రీన్ ఎనర్జీ నిర్మిస్తున్న పంప్డుస్టోరేజి ప్లాంటు వరద నారాయణమూర్తి రైవాడ జలాశయం పరీవాహక ప్రాంతం పరిధిలోకి వస్తుంది. ఈ విద్యుత్తు ప్రాజెక్టులో భాగంగా ఎగువ రిజర్వాయర్ స్థానికవాగుపై కుడియా గ్రామం వద్ద, దిగువ రిజర్వాయర్ ఈ వాగులో మరో వాగు వచ్చి కలిసేచోట నిర్మించనున్నారు. జలవనరులశాఖ అధికారులు ఈ పంప్డు స్టోరేజి ప్లాంటు ఏర్పాటు నేపథ్యంలో ఒక నివేదిక సమర్పించారు. అందులో ఏం ఉందంటే..
* వరద నారాయణమూర్తి రైవాడ జలాశయం ప్రాజెక్టు దిగువన 15,344 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయం నుంచి విశాఖకు 1.581 టీఎంసీల నీరు సరఫరా చేస్తారు. విశాఖకు తాగునీరు ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే విజయనగరం జిల్లాలోని 6,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందడం లేదు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును సందర్శించి రైవాడ కింద నీరందని ఆరు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
* ఈ పంప్డు స్టోరేజి ప్రాజెక్టులోని రెండు జలాశయాలకు వరుసగా 0.498 టీఎంసీలు, 0.607 టీఎంసీలు నీరు అవసరమవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే రైవాడ జలాశయం నీటికొరత ఎదుర్కొంటోంది. పంప్డు స్టోరేజి ప్రాజెక్టు వల్ల ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే కొన్ని షరతులతో నీళ్లు ఇవ్వాలి. డీపీఆర్‌లో అలా పేర్కొన్నా.. చివరకు ఉత్తర్వుల్లో 0.393 టీఎంసీలు ఒకసారి, 0.016 టీఎంసీలు ఏటా ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారు.
* రైవాడ జలాశయంలో మిగులు నీళ్లు ఉండి స్పిల్ వే మీదుగా దిగువకు వదిలేసే క్రమంలోనే విద్యుత్తు ప్రాజెక్టుకు నీళ్లు తీసుకోవాలి.
* నీళ్లు రాని రోజుల్లో దిగువకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న కొద్దిపాటి నీళ్లు వదిలేందుకు వీలుగా ప్రాజెక్టు వద్ద రివర్ స్లూయిస్ గేట్లు ఏర్పాటు చేసుకోవాలి.
ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న షరతులివీ..
* ఇప్పటికే తాండవ జలాశయానికి నీటిసమస్య ఉండటంతో పవర్ ప్రాజెక్టుకు కొన్ని షరతులతో నీటిని సరఫరా చేయవచ్చు.
* తాండవ జలాశయం నిండిపోయి స్పిల్ వే మీదుగా నీళ్లు దిగువకు చేరుతున్నప్పుడే ఈ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకోవాలి.
* నీళ్లు రానప్పుడు ఇబ్బంది లేకుండా పవర్ ప్రాజెక్టు నిర్మించేచోట రివర్ స్లూయిస్ గేట్లు ఏర్పాటుచేసి నీళ్లు దిగువకు వదిలేలా చూడాలి.
* ఈ పంప్డు స్టోరేజి ప్రాజెక్టు వల్ల ప్రస్తుత ఆయకట్టుకు, పరిశ్రమలకు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది వాటిల్లకూడదు.
* తాండవ జలాశయం స్పిల్‌వే మీదుగా నీరు దిగువకు వదులుతున్నప్పుడే పంప్డు స్టోరేజి స్కీంలోకి నీళ్లను తీసుకోవాలి.
* జలవనరులశాఖఅధికారులు ఎప్పుడైనా తనిఖీ చేయాలనుకుంటే వారిని ప్రాజెక్టులోకి అనుమతించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Moeen Ali: మొయిన్ అలీ యూ-టర్న్.. టెస్టు స్క్వాడ్‌లోకి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్
-
Crime News
Gangster Murder: కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ హత్య.. లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Ukrain: ఖెర్సాన్‌ను ముంచుతున్న ముప్పు..!
-
General News
Viveka Murder case: వివేకానందరెడ్డి రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి
-
Politics News
Chandrababu: వైకాపా విధానాల వల్లే ఏపీలో విద్యారంగం నాశనం: చంద్రబాబు