బకాయిలు చెల్లిస్తేనే డయాలసిస్‌ సేవలు

ప్రభుత్వం బిల్లుల బకాయిలను చెల్లించకపోవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో అందించే రకరకాల సేవలను కొనసాగించేందుకు ఏజెన్సీలు వెనకడుగేసే దుస్థితి నెలకొంది.

Updated : 24 Mar 2023 05:00 IST

లేకుంటే 28 నుంచి నిలిపివేత
టెక్కలి ఆసుపత్రిలో ఏజెన్సీ పబ్లిక్‌ నోటీసు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం బిల్లుల బకాయిలను చెల్లించకపోవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో అందించే రకరకాల సేవలను కొనసాగించేందుకు ఏజెన్సీలు వెనకడుగేసే దుస్థితి నెలకొంది. నెఫ్రోప్లస్‌తోపాటు మరో యాజమాన్యం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన కేంద్రాల్లో రోగులకు డయాలసిస్‌ సేవలు అందుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సంస్థలకు గత కొద్ది నెలలుగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ఆసుపత్రిలో బిల్ల్లుల చెల్లింపు జరగనందున ఈ నెల 28 నుంచి డయాలసిస్‌ సేవలను నిలిపివేస్తున్నామని ఆసుపత్రి ప్రాంగణంలోని నోటీసు బోర్డులో నెఫ్రోప్లస్‌ యాజమాన్యం గురువారం పబ్లిక్‌ నోటీసును ఏర్పాటుచేసింది. ‘‘టెక్కలి ఆసుపత్రిలో మే, 2022 నుంచి మాకు నెల వారీగా చెల్లింపులు జరగడంలేదు. ఈ నెల 27వ తేదీలోగా బకాయిపడ్డ బిల్లులను చెల్లించకుంటే మరసటిరోజు నుంచి డయాలసిస్‌ సేవలు నిలిపివేయడం మినహా మాకు వేరే మార్గంలేదు’ అని ఆ నోటీసులో పేర్కొంది. ఈ ఆసుపత్రి వరకు మాత్రమే సుమారు కోటిన్నర రూపాయలకు ప్రభుత్వం బకాయి పడింది. జిల్లా అధికారుల ద్వారా  పదేపదే విజ్ఞప్తిచేసినా ఫలితం కనిపించనందువల్లే పరిస్థితి ఇంత వరకు వచ్చిందని     చెబుతున్నారు. ఈ పరిణామంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టెక్కలి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూర్యారావును వివరణ కోరగా, ఈ సమస్యను ఆరోగ్యశాఖ కమిషనర్‌, కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు