హైకోర్టు తరలింపు.. న్యాయస్థానం పరిధిలోనే..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాల్సి ఉంటుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.

Updated : 24 Mar 2023 05:03 IST

రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవాల్సి ఉంటుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థాన పరిధిలో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును కర్నూలుకు మార్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా? ఆ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని, దృక్పథాన్ని, విధానాన్ని ఏమైనా వ్యక్తం చేసిందా? చేసి ఉంటే ఆ వివరాలేంటి అని గురువారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ టి.ధన్‌గోపాల్‌ రావ్‌ అండ్‌ అదర్స్‌ కేసులో 2018 అక్టోబర్‌ 29న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టును సంప్రదించి అమరావతి ప్రధాన కేంద్రంగా 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేశాం. 2020 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు మార్చాలని ప్రతిపాదించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా హైకోర్టులో రిట్‌ పిటిషన్లు, ఇతర కేసులు దాఖలయ్యాయి. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ ఈ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు 2020 ఆగస్టు 4న ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మార్చి 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో అమరావతి రాజధాని నగరం, ప్రాంతంలో మొత్తం అభివృద్ధి, మౌలిక వసతుల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీసీఆర్‌డీఏని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన ధర్మాసనం మార్పుపై సంబంధిత రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు నిర్వహణ వ్యయాన్ని భరించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే. అదే సమయంలో కోర్టు రోజువారీ పరిపాలనా బాధ్యత సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఉంటుంది. అందువల్ల హైకోర్టును కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవాలి’ అని కిరణ్‌ రిజిజు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని