గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన టి.గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డికి గురువారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బెయిలు రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ
ఈనాడు, హైదరాబాద్: మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన టి.గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డికి గురువారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిలు రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గంగిరెడ్డి బెయిలు రద్దు వ్యవహారంలో సుప్రీంకోర్టు నుంచి బదిలీ అయిన సీబీఐ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత విచారణ చేపట్టారు. బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ గంగిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. వివేకా హత్య కేసులో 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు పూర్తిచేసి అభియోగ పత్రం దాఖలు చేయకపోవడంతో చట్టప్రకారం (డీఫాల్ట్) బెయిలు మంజూరు చేస్తూ పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టు 2019 జూన్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం హత్య కేసు ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి బదిలీ కావడంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ గంగిరెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ 2021 అక్టోబరు 26న అభియోగ పత్రం దాఖలు చేసింది. దీంతోపాటు గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌ను కింది కోర్టు కొట్టివేయడంతో సీబీఐ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ఏపీ హైకోర్టు ఒకసారి చట్టప్రకారం డీఫాల్ట్ బెయిలు మంజూరు చేసిన తరవాత కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి బెయిలు రద్దు చేయడం కుదరదంటూ సీబీఐ పిటిషన్‌ను కొట్టివేస్తూ గత ఏడాది మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు అభియోగపత్రం దాఖలు చేసిన తరవాత డీఫాల్ట్ బెయిలు పొందిన వ్యక్తి నేరానికి పాల్పడినట్లు బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ బెయిలును రద్దు చేయకపోవడం సరికాదని పేర్కొంది. బలమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి కస్టడీలో ఉండటానికే అర్హుడని పేర్కొంది. కేవలం డీఫాల్ట్ బెయిలు మీద విడుదల చేసినట్లైతే కేసు పూర్వాపరాలను సమీక్షించి నిర్ణయం తీసుకునే అధికారం కోర్టుకు ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ కేసు పూర్వాపరాలను తాజాగా పరిశీలించి సీబీఐ దాఖలు చేసిన బెయిలు రద్దు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టుకు జనవరి 16న బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బదిలీ అయిన సీబీఐ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారించింది.
గంగిరెడ్డిదే కీలక పాత్ర: వివేకా హత్య కేసులో గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రి ఇతర నిందితులు సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వివేకా ఇంట్లోకి రావడానికి గంగిరెడ్డి సహకరించారని తెలిపింది. గంగిరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, వారి సన్నిహితులు 15న ఉదయం వివేకా ఇంటికి వెళ్లారని, వివేకా గుండెపోటుతో మృతి చెందారన్న ప్రచారం చేయడంలో భాగస్వాములుగా ఉన్నారని తెలిపింది.
ఇప్పటికే ప్రభావితం చేశారు: గంగిరెడ్డి పులివెందులకు చెందిన వాడని, అంతేగాకుండా రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి పలుకుబడి ఉన్న వ్యక్తిగా చలామణి అవుతున్నారని సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో కీలక సాక్షులను ఇప్పటికే ప్రభావితం చేసినట్లు తెలిపింది. హత్య కుట్రతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాల చెరిపివేతకు సంబంధించి గంగిరెడ్డి పాత్రపై వివరాలందించిన వారందరూ పులివెందుల, సమీప ప్రాంతాలకు చెందినవారేనని, ఈ సాక్షులను ఇప్పటికే బెదిరించినట్లు సమాచారం ఉందని తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్నందున కీలక నిందితులపై ప్రభావితం చేస్తున్న గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలని సీబీఐ తన పిటిషన్‌లో కోరింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: ఆందోళనకు దిగిన రెజ్లర్లపై కేసులు నమోదు
-
General News
CM Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు