10 నెలల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

బిడ్డకు వైద్య సమస్య వచ్చిందని తండ్రి వదిలేసి వెళ్లిపోయినా ఎలాగైనా తన బిడ్డను కాపాడుకోవాలని ఆ తల్లి తపనపడింది.

Updated : 24 Mar 2023 04:04 IST

2 కిలోల కణితిని తొలగించిన కర్నూలు వైద్యులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: బిడ్డకు వైద్య సమస్య వచ్చిందని తండ్రి వదిలేసి వెళ్లిపోయినా ఎలాగైనా తన బిడ్డను కాపాడుకోవాలని ఆ తల్లి తపనపడింది. లక్షల్లో ఒకరికి వచ్చే సమస్యతో బాధపడుతున్న శిశువుకు శస్త్ర చికిత్స చేసి ఆ అమ్మకు సాంత్వన చేకూర్చారు కర్నూలు సర్వజన ఆస్పత్రి పీడియాట్రిక్‌ వైద్యులు. గుంటూరు జిల్లాకు చెందిన బాల ఏసు (10 నెలలు) వీపుపై పెద్ద కణితి రావడంతో తల్లి, బిడ్డను వదిలేసి తండ్రి వెళ్లిపోయాడు. కణితి రోజురోజుకూ పెరిగిపోవడంతో తల్లి ఆ శిశువును పలు ఆస్పత్రుల్లో చూపించింది. ఆఖరికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించాలని సూచించారు. కర్నూలు వైద్యులు శిశువును గత నెల 4న పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో చేర్పించుకున్నారు. గత నెల 15న డాక్టర్‌ శివకుమార్‌, డాక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో 2 కిలోలకుపైగా ఉన్న కణితిని తొలగించారు. వైద్యులు మాట్లాడుతూ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించాలంటే సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఖర్చవుతుందని, ప్రపంచంలో ఇలాంటి కేసులు ఎనిమిది మాత్రమే ఉన్నాయని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు