ఎమ్మెల్యేలు ఎర్రగీత దాటితే సస్పెన్షనే

‘శాసనసభలో స్పీకర్‌ పోడియం ముందు కొత్తగా ఏర్పాటు చేసిన ఎర్రగీతను దాటి ఎవరు లోపలికి వచ్చినా 3 రోజుల పాటు లేదా, ఆ సమావేశాలు జరిగినన్నాళ్లూ సస్పెండ్‌ చేస్తాం.

Updated : 24 Mar 2023 04:03 IST

స్పీకర్‌ తమ్మినేని సీతారాం రూలింగ్‌

ఈనాడు, అమరావతి: ‘శాసనసభలో స్పీకర్‌ పోడియం ముందు కొత్తగా ఏర్పాటు చేసిన ఎర్రగీతను దాటి ఎవరు లోపలికి వచ్చినా 3 రోజుల పాటు లేదా, ఆ సమావేశాలు జరిగినన్నాళ్లూ సస్పెండ్‌ చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా తీర్మానం అవసరం లేదు. ఎర్రగీత దాటిన వారిని నేను గుర్తించి, వారిపేర్లను వెల్లడిస్తే చాలు సస్పెండ్‌ అయినట్లే’ అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం గురువారం సభలో ప్రకటించారు. ఈ మేరకు రూలింగ్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎర్రగీత అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏలేరు ఆధునికీకరణపై తెదేపా సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిద్ధమయ్యారు. ఆ ప్రశ్న అడిగిన సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లినందున సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తమ్మినేని సీతారాం చెబుతూ... సమాధానాలు డీమ్డ్‌ టు బి అని అన్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ... సభలో ఈమధ్య చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. తెదేపా సభ్యులు వచ్చి గొడవ పడి, గందరగోళం సృష్టించే కన్నా వారు రాకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. పోడియం ముందు కొత్తగా ఎర్రగీత కనిపిస్తోందని అన్నారు. సభలో శుక్రవారం ఆఖరిరోజు తెదేపా సభ్యులు అల్లరి చేసి వెళ్లాలని చూడొచ్చని, సమావేశం సజావుగా సాగేలా చూడాలని కోరారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... ఒకసారి రూలింగ్‌ ఇస్తే రూలింగే అని అన్నారు. సభ హుందాతనం కాపాడేందుకు, మిగిలిన సభ్యుల హక్కుల రక్షణకు, కచ్చితంగా దీన్ని అమలు చేస్తామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు