అసంపూర్తిగా పోలవరం తొలి దశ సహాయ, పునరావాసం

పోలవరం ప్రాజెక్టు మొదటి దశ సహాయ, పునరావాసం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. పూర్తి కాలేదని జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు.

Updated : 24 Mar 2023 04:01 IST

41.15 మీటర్ల ఎత్తు వరకే మొదటి దశ
కేవలం 11,677 కుటుంబాలకే ప్రయోజనం
కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు మొదటి దశ సహాయ, పునరావాసం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. పూర్తి కాలేదని జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టు తొలి దశ 41.15 మీటర్ల ఎత్తు వరకేనని, పోలవరం కింద మొత్తం 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతుండగా.. తొలి దశ కిందకు 20,946 కుటుంబాలు వస్తాయని వెల్లడించారు. 20,946 కుటుంబాల్లో ఫిబ్రవరి నాటికి కేవలం 11,677 కుటుంబాలకే (55.74 శాతం) సహాయం, పునరావాసం కల్పించినట్లు స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సహాయం, పునరావాసం జాప్యంపై సమయానుగుణంగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల్లో 18 ఏళ్లు నిండిన వారిని ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించాలని పలువురు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 2005, ఏప్రిల్‌ 8న జారీ చేసిన ప్రాజెక్టు ప్రాథమిక నోటిఫికేషన్‌ నాటికి 18 ఏళ్లు నిండిన వారే అందుకు అర్హులని తెలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్‌ తరువాత 18 ఏళ్లు నిండిన వారు ప్రత్యేక కుటుంబాల కింద అర్హులు కారని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల్లో అత్యధికులు వారే ఉన్నారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని