పోలవరం కోసం ప్రధానిని రూ.15 వేల కోట్లు అడిగా

‘పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున..ప్రాజెక్టు పనుల కోసం తాత్కాలికంగా రూ.15 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసి కోరాను.

Updated : 24 Mar 2023 10:21 IST

తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీళ్లు నింపుతాం
పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు,అమరావతి: ‘పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున..ప్రాజెక్టు పనుల కోసం తాత్కాలికంగా రూ.15 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసి కోరాను. ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరం.. అది అడగడానికి..అర్ధించడానికే ప్రధానమంత్రిని కలిశాను’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో గురువారం ‘‘పోలవరం ప్రాజెక్టు’’పై స్వల్పకాలిక చర్చ జరిగింది. దీనికి ముఖ్యమంత్రి సమాధానమిస్తూ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్‌ను 45.7 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే సీడబ్ల్యూసీ ఖరారు చేసిన డ్యామ్‌ భద్రత నిబంధనల మేరకు తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీళ్లు నింపుతామని పేర్కొన్నారు. ఆ తరవాత మూడేళ్లలో రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తామని వివరించారు. ఈ విషయంలో దుష్ప్రచారాలు సరికాదని వ్యాఖ్యానించారు. 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీరు నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే గ్రామాలకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారం ప్రక్రియ తొలుత పూర్తి చేస్తామని చెప్పారు. ‘నిర్వాసితుల వివరాలన్నీ మీకు సమర్పిస్తాం. మీరే నేరుగా బటన్‌ నొక్కి.. వారి ఖాతాల్లో నగదు జమ చేయండి’ అని కూడా కేంద్రాన్ని కోరామని అన్నారు. ఆ సొమ్ముతో పాటు గతంలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి నిర్వాసిత కుటుంబానికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పారు. దీని కోసం రూ.500 కోట్లు సిద్ధం చేశామని వ్యాఖ్యానించారు. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యంలో నీళ్లు నింపడానికి మరో మూడేళ్ల సమయం ఉంటుంది కాబట్టి.... భూసేకరణ, పునరావాసం, పరిహారం సొమ్ములు చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం, వెసులుబాటు లభిస్తుందని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ డబ్బూ చెల్లించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానని వ్యాఖ్యానించారు. సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే!

చంద్రబాబు ఏం చేశారు?

* 2004 కంటే ముందు చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఏం వెలగబెట్టారు? పోలవరం గురించి ఏ రోజైనా మాట్లాడారా? 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి 2014 వరకూ అంటే 19 ఏళ్లు ఈ ప్రాజెక్టు గురించి ఏ ఒక్క రోజూ మాట్లాడలేదు.  పోలవరం పేరు పలికే అర్హత ఆయనకు లేదు. 2004లో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రై... దాన్ని తన కలల ప్రాజెక్టుగా ప్రకటించి..ప్రారంభించేంత వరకూ పోలవరం ప్రాజెక్టు ఒకటుందని ఎవరైనా ఆలోచించారా? అలాంటిది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబే కట్టారని, దాన్ని ఉరుకులు, పరుగులు తీయించారని ప్రచారం చేసుకుంటున్నారు. పోలవరం అంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. దాన్ని ప్రారంభించింది మా నాన్నే. పూర్తిచేసేది ఆయన కుమారుడినైన నేనే.

* మేము అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్‌ టెండరింగ్‌ చేశాం. తద్వారా రూ.800 కోట్లు ఖజానాకు మిగిలింది.

అందుకే డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది

ఇంజినీరింగ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం తొలుత స్పిల్‌వే కట్టాలి. ఆ తర్వాత ఎగువ కాఫర్‌ డ్యామ్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి. ఆ పనులు పూర్తయ్యాక ప్రధాన డ్యామ్‌ స్ట్రక్చర్‌ కట్టాలి. తెదేపా హయాంలో స్పిల్‌వే పనులు అసంపూర్ణంగా వదిలేసి కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టారు. అదీ పూర్తి చేయలేదు. గోదావరి నది వెడల్పు 2,400 మీటర్లు. 1,600 మీటర్ల మేర కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి 400 మీటర్ల చొప్పున రెండు చోట్ల గ్యాప్‌లు వదిలారు. ఫలితంగా డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.. స్పిల్‌వే పూర్తికాకుండానే కాఫర్‌ డ్యామ్‌ ఎలా కట్టారు? కాఫర్‌ డ్యామ్‌ అసంపూర్ణంగా వదిలేసి డయాఫ్రమ్‌వాల్‌ ఎలా నిర్మించారు?

మరో 18 నెలలు లేదా అంతకంటే వేగంగానే...

ప్రస్తుతం స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యింది. డెడ్‌ స్టోరేజీలో నీళ్లు పెట్టి.. రివర్‌ స్లూయిస్‌ ద్వారా ఈ రోజు కూడా గోదావరి డెల్టాకు నీరు ఇవ్వొచ్చు. అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా స్పిల్‌ ఛానల్‌, దాని కింద పైలట్‌ ఛానల్‌ పనులు పూర్తి చేశాం. 100 ఏళ్ల చరిత్రలో గోదావరికి రెండో అతి పెద్ద వరద వచ్చినా సరే సమర్థంగా వరద నియంత్రించాం. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేస్తే దాన్ని పూర్తి చేశాం. అన్ని రకాల మరమ్మతులూ చేశాం. ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే పూర్తైంది. గోదావరి నది స్పిల్‌వే మీదుగానే ప్రస్తుతం పారుతోంది. వర్షాకాలం వచ్చినా సరే ప్రధాన డ్యామ్‌ నిర్మాణ పనులు చేపట్టడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. డయాఫ్రమ్‌వాల్‌ 30 శాతం మేర దెబ్బతిన్నట్లు తేలింది. మరో 18 నెలల్లో లేదా అంతకంటే వేగంగానే పనులు పూర్తి చేస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని