వైద్యుల ఖాళీల భర్తీకి స్పందన కరవు

రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాల కోసం గురువారం నుంచి వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు ప్రారంభంకాగా తొలిరోజే అభ్యర్థుల నుంచి స్పందన కనిపించలేదు.

Updated : 24 Mar 2023 05:47 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో వైద్యుల నియామకాల కోసం గురువారం నుంచి వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు ప్రారంభంకాగా తొలిరోజే అభ్యర్థుల నుంచి స్పందన కనిపించలేదు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ కేటగిరీల్లో 128 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోగా..88 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలోనూ 38 మందే రెగ్యులర్‌ విధానంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నారు. నిబంధనల ప్రకారం రోస్టర్‌ పాయింట్ల ఆధారంగానే నియామకాలు జరగాలి. దీని ప్రకారం కొన్ని పోస్టులకు అభ్యర్థులు దొరకని పరిస్థితి తలెత్తింది. సాధారణంగా జనరల్‌ మెడిసిన్‌ పోస్టులకు డిమాండ్‌ ఉంటుంది. 74 పోస్టులకు 38 మంది అభ్యర్థులు రాగా..వీరిలో 19 మందే విధుల్లో చేరేందుకు మొగ్గుచూపారు. జనరల్‌ సర్జరీ పోస్టులు 39 ఉండగా 40 మంది దరఖాస్తుచేశారు. వీరిలో 14 మంది నియామకపత్రాలు అందుకున్నారు. డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో ఏడు, రెండు, ఆరు చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో మూడు, ఒకటి, ఒకటి చొప్పున మాత్రమే భర్తీ అయ్యాయి. ఒప్పంద విధానంలో చేరేందుకు ఆసక్తి కనబరిచిన మరో 17 మందికి శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వీరిలో ఎంతమంది విధుల్లో చేరేందుకు ముందుకొస్తారన్నది సందేహమే. మొత్తంగా 319 పోస్టులను 14 కేటగిరీల్లో భర్తీచేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు విజయవాడ పాత ఆసుపత్రిలోని డీఎంఈ కార్యాలయంలో ఈ వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబరు, డిసెంబరులో కలిపి రెండుసార్లు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలు నిర్వహించారు. దీని ప్రకారం 70 వైద్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉండాలి. కానీ ఈ సంఖ్య ప్రస్తుతం 319 వరకు చేరింది. ఉద్యోగాలు పొందిన వారు విధుల్లో చేరడంలేదు. చేరిన వారు నిలకడగా ఉండటంలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు