జాతీయ రహదారి ‘516ఈ’ పనులకు రూ.1,685.56 కోట్లు

జాతీయ రహదారి ‘516ఈ’ లోని కొయ్యూరు-అరకు (183.35 కి.మీ.), బౌదర-విజయనగరం (26.94 కి.మీ.) మధ్య పనులను ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్నామని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Updated : 24 Mar 2023 10:47 IST

ఈనాడు, దిల్లీ: జాతీయ రహదారి ‘516ఈ’ లోని కొయ్యూరు-అరకు (183.35 కి.మీ.), బౌదర-విజయనగరం (26.94 కి.మీ.) మధ్య పనులను ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్నామని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మొత్తంగా ఆరు ప్యాకేజీల్లో చేపట్టే ఈ పనులకు రూ.1,685.56 కోట్లు మంజూరు చేశామని, ఇప్పటికే రూ.302.21 కోట్లు వ్యయం చేశామని వెల్లడించారు. 2025, డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

* మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ ఇప్పించే నవ సవేరా పథకంలో ఇప్పటి వరకు 1.19 లక్షల మంది లబ్ధి పొందగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 12,155 మంది ఉన్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* భారత్‌మాల పరియోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో 2019-20 నుంచి 2022-23 వరకు రూ.10,973.45 కోట్లు వెచ్చించి 437.68 కి.మీ. మేర రహదారులు నిర్మించినట్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. హిందూపురం, కర్నూలు ఎంపీలు గోరంట్ల మాధవ్‌, సింగారి సంజీవ్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ (సౌర ఫలకలు) తయారీకి స్థలాన్ని ఒక బిడ్డర్‌ ఎంపిక చేసుకున్నారని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2017-18 నుంచి 2023 ఫిబ్రవరి వరకు చిన్న జలవిద్యుత్తు ప్రాజెక్టుల నుంచి 12.20 మెగావాట్లు, గాలి మరల (విండ్‌ పవర్‌) ద్వారా 477.80 మెగావాట్లు, బయో పవర్‌ 11.57 మెగావాట్లు, సౌర విద్యుదుత్పత్తి 2,638.78 మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.

* దక్షిణ మధ్య రైల్వేలో నాన్‌ గెజిటెడ్‌ అధికారుల విభాగంలో గుంటూరు డివిజన్‌లో మొత్తం 690 (గ్రూప్‌-సిలో 304, లెవల్‌-1లో 386) పోస్టులు, సికింద్రాబాద్‌ డివిజన్‌లో 2908 (గ్రూప్‌-సిలో 1796, లెవల్‌-1లో1112) పోస్టులు ఖాళీలున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. నరసరావుపేట, వరంగల్‌, చేవెళ్ల, మహబూబాబాద్‌, పెద్దపల్లి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పసునూరి దయాకర్‌, డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత, బి.వెంకటేష్‌ నేతలు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో టెక్నికల్‌, పారా మెడికల్‌, మినిస్టీరియల్‌ క్యాటగిరీల్లోని 3,347 పోస్టుల భర్తీకి 2019లో నోటిఫికేషన్‌ ఇవ్వగా 2,870 మంది ఉద్యోగాల్లో చేరారని మంత్రి వెల్లడించారు.

సింహాచలంలో భక్తుల సౌకర్యాలకు రూ.54 కోట్లు

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యాల కల్పన కోసం ప్రసాద్‌ పథకం కింద 2022-23లో రూ.54.04 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

* విశాఖపట్నం పోర్టు అవుటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ బెర్త్‌, ఛానల్‌ బెర్త్‌ల నిర్మాణానికి రూ.38.50 కోట్లు ఖర్చు కానుందని, అందులో రూ.29.91 కోట్లు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ సమకూరుస్తున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు