రూ.909 కోట్ల పనులు రూ.526 కోట్లకే!

జాతీయ రహదారి విస్తరణకు టెండర్లు పిలిస్తే... అంచనా విలువ కంటే రికార్డుస్థాయిలో 42.06 శాతం తక్కువకు కోట్‌చేసి రెండు గుత్తేదారు సంస్థలు సంయుక్తంగా పని దక్కించుకున్నాయి.

Updated : 24 Mar 2023 05:51 IST

రూ.382 కోట్ల తక్కువకు టెండరు ఖరారు
పుట్టపర్తి-కోడూరు రోడ్‌లో 42 శాతం లెస్‌

ఈనాడు, అమరావతి: జాతీయ రహదారి విస్తరణకు టెండర్లు పిలిస్తే... అంచనా విలువ కంటే రికార్డుస్థాయిలో 42.06 శాతం తక్కువకు కోట్‌చేసి రెండు గుత్తేదారు సంస్థలు సంయుక్తంగా పని దక్కించుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నుంచి కోడూరు(కొడికొండ చెక్‌పోస్టు సమీపం) వరకు ప్రస్తుతమున్న రెండు వరుసల జాతీయ రహదారిని 47.65 కి.మీ.మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి రూ.909.19 కోట్ల అంచనా విలువతో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్‌) ఇటీవల టెండర్లు పిలిచింది. 17 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా, 12 సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయి. వీటి ధరల బిడ్లను తాజాగా తెరిచారు. ఇందులో ఎన్‌ఎస్‌పీఆర్‌, లెకాన్‌ సంస్థలు సంయుక్తంగా (జేవీ) అంచనా విలువ కంటే రూ.382.39 కోట్లు తక్కువకు(42.06 శాతం) కోట్‌చేసి ఎల్‌-1 నిలిచాయి. అంటే రూ.909.19 కోట్ల అంచనా విలువైన రహదారి విస్తరణ పనిని రూ.526.80 కోట్లకే చేయడానికి సిద్ధమయ్యాయి. కొంతకాలంగా రాష్ట్రంలో ఎన్‌హెచ్‌ పనులకు పిలిచిన టెండర్లలో అంచనా విలువ కంటే సగటున 25-30 శాతం తక్కువకు కోట్‌ చేసి గుత్తేదారులు పనులు దక్కించుకుంటున్నారు. అయితే పుట్టపర్తి-కోడూరు రహదారి పనిలో 42.06 శాతం తక్కువకు కోట్‌ కావడం రికార్డు అని గుత్తేదారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ రహదారుల్లో సక్రమంగా పనులు లేకపోవడం, ఒకవేళ పనులు చేసినా చెల్లింపులు జరుగుతాయనే నమ్మకం లేకపోవడంతో గుత్తేదారు సంస్థలు ఎన్‌హెచ్‌ పనులపై దృష్టిపెట్టి, అందులో పోటీపడుతున్నట్లు పేర్కొంటున్నారు.

రెండు ఎన్‌హెచ్‌ల విస్తరణకు...

రెండు జాతీయ రహదారులను విస్తరించేందుకు మోర్త్‌లోని స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీ (ఎస్‌ఎఫ్‌సీ) తాజాగా ఆమోదం తెలిపింది.

* వాడరేవు-చిలకలూరిపేట మధ్య(ప్యాకేజీ-1) 48 కి.మీ.ను రూ.1,064.24 కోట్లతో, చిలకలూరిపేట-నకరికల్లు మధ్య (ప్యాకేజీ-2) 37 కి.మీ.ను రూ.787.38 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు.

* కొండమోడు-పేరేచర్ల మధ్య 50 కి.మీ.లను రూ.1,046.59 కోట్లతో విస్తరించేందుకు ఆమోదం లభించింది.

* రెండు రహదారులకు ఇక మోర్త్‌ సాంకేతిక అనుమతి, నిధుల మంజూరు (టీఏఎఫ్‌ఎస్‌) జరిగితే... టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని