ఈబీసీ నేస్తం విధివిధానాలు సరళతరం చేయాలి

ఈబీసీ నేస్తం అమలులో విధివిధానాలను మరింత సరళతరం చేయాలని గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా సభ్యులు కోరారు.

Published : 24 Mar 2023 05:24 IST

ఈనాడు, అమరావతి: ఈబీసీ నేస్తం అమలులో విధివిధానాలను మరింత సరళతరం చేయాలని గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా సభ్యులు కోరారు. ఈబీసీ నేస్తంపై అధికారపక్ష సభ్యులు పుప్పాల శ్రీనివాసరావు, పర్వతి శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌, శ్రీనివాసనాయుడు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ మంత్రి తరఫున వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమాధానమిచ్చారు. పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనలు సరళతరం చేస్తే ఎక్కువ మందికి లబ్ధి కలుగుతుందన్నారు. మరో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సచివాలయాల్లో చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను పెండింగులో ఉంచుతున్నారన్నారు. 26 జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగులో ఉన్నాయో చెప్పాలని కోరారు. ఈ పథకం ధ్రువీకరణ పత్రాలు స్థానిక ప్రజాప్రతినిధులతోనే ఇప్పించాలన్నారు. మంత్రి కాకాణి సమాధానం ఇస్తూ ఈ కార్యక్రమం స్థానిక ప్రజాప్రతినిధులు, సభ్యులతోనే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తులు పెండింగు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని తిరస్కరించినా మళ్లీ పరిశీలించి తదుపరి వారికి లబ్ధి కల్పిస్తూనే ఉన్నామని చెప్పారు.

కల్యాణమస్తు నిబంధనలు సడలించాలి

రాష్ట్రంలో కల్యాణమస్తు పథకం అమలులో నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో వధువు, వరుడు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉండేది కాదన్నారు. తాజాగా ఈ నిబంధన విధించారని, అది మంచిదే అయినా గిరిజన ప్రాంతాల్లో దీని వల్ల ఇబ్బంది ఎదురవుతోందన్నారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ కల్యాణమస్తులో ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. తెదేపా హయాంలో గడువు దాటితే మళ్లీ దరఖాస్తుకు అవకాశం ఉండేది కాదన్నారు.

జులై నాటికి అంబేడ్కర్‌ విగ్రహం సిద్ధం

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం 2023 జులై నాటికి సిద్ధమవుతుందని మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ విగ్రహం పురోగతిపై అధికారపక్ష సభ్యులు కైలే అనిల్‌కుమార్‌, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, గొల్ల బాబూరావు, కంబాల జోగులు, ఉండవల్లి శ్రీదేవి, అలజంగి జోగారావు లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆపై సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడగగా మంత్రి స్పందించారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందన్నారు. దాదాపు 18.5 ఎకరాల స్థలాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ఈ విగ్రహ ఏర్పాటు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ పని చేస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌కు సభలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ శుక్రవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి నాగార్జునను ఆదేశించారు.

మైనారిటీల సంక్షేమానికి ఎంతో చేస్తున్నాం

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వ హయాంలో ఇంతవరకు రూ.21,756 కోట్లు ఖర్చు చేసినట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్‌బాషా వెల్లడించారు. ప్రభుత్వం మైనారిటీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏమిటో తెలియజేయాలని వైకాపా సభ్యులు అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌, షేక్‌ మహ్మద్‌ ముస్తఫా షేక్‌, ఎం.నవాజ్‌బాషా, పి.వి.సిద్ధారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఏలేరు రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులకు భూసేకరణ పూర్తి కావాలి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌ ఆధునికీకరణలో మొదటి దశ పనులు పురోగతిలో ఉన్నాయని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం శాసనసభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. తెదేపా సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెదేపా సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగు నేపథ్యంలో ఆ సమయంలో సభలో లేకపోవడంతో లిఖిత పూర్వక సమాధానంతో సరిపెట్టారు. అనుబంధ ప్రశ్నలకు, సమాధానాలకు ఆస్కారం లేకపోయింది. మొదటి దశ పనులు 59.81శాతం పూర్తయినట్లు మంత్రి చెప్పారు. మిగిలినవి భూసేకరణ సమస్య వల్ల పెండింగులో ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని