ఏడాదిలో 322 రోజులు అప్పుల్లోనే..

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు(ఆర్‌బీఐ)లో కనీస నగదు నిల్వ నిర్వహించడానికి ఇబ్బందులు పడుతోంది. కనీస నగదు నిల్వలు లేకపోతే చెల్లింపులకు ఏదో రూపంలో అప్పులు చేయాల్సిందే.

Published : 25 Mar 2023 06:25 IST

బడ్జెటేతర రుణాలూ వెల్లడించాల్సిందే
కాగ్‌ స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు(ఆర్‌బీఐ)లో కనీస నగదు నిల్వ నిర్వహించడానికి ఇబ్బందులు పడుతోంది. కనీస నగదు నిల్వలు లేకపోతే చెల్లింపులకు ఏదో రూపంలో అప్పులు చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ వద్ద కనీసం రోజూవారీ  కనీస నిల్వ రూ.1.94 కోట్లు ఉండేలా చూసుకోవాలి. అంగీకరించిన నగదు నిల్వ కన్నా ఏనాడైనా తగ్గితే ఆ మొత్తాన్ని వేస్‌ అండ్‌ మీన్స్‌ (చేబదుళ్లు) అడ్వాన్సులు, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం, ఓవర్‌ డ్రాఫ్టు రూపంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు కూడా పరిమితులు ఉంటాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 322 రోజుల పాటు ఇలా వేరే మార్గాల్లో కనీస నిల్వను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. ఇలా వివిధ రూపాల్లో రిజర్వుబ్యాంకు కల్పించే ఆర్థిక వెసులుబాట్లను వినియోగించుకోవడమూ ఒక రకంగా రుణం తీసుకోవడమే. ఆ మొత్తం తిరిగి చెల్లించే క్రమంలో దానిపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఏకంగా 322 రోజుల పాటు అప్పుల్లోనే ఉన్నట్లు కాగ్‌ తేల్చింది. ఇలా అన్ని రోజుల పాటు రూ.1,06,325.66 కోట్లు అప్పు రూపంలో వినియోగించుకోవాల్సి వచ్చింది. ఆ మొత్తాలను రూ.111.72 కోట్ల వడ్డీతో కలిపి చెల్లించినట్లు కాగ్‌ పేర్కొంది. ‘రాష్ట్ర ప్రభుత్వం తరచుగా వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం, ఓవర్‌ డ్రాఫ్టులను వినియోగించే అగత్యాన్ని తగ్గించడంతో పాటు తమ నగదు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి’ అని కాగ్‌ సూచించింది.

వివిధ సామాజిక ఆర్థికాభివృద్ధి పథకాలకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణాల మీద ఆధారపడకుండా రెవెన్యూ వనరులను సమకూర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయాలని కాగ్‌ సిఫార్సు చేసింది. ఆస్తుల కల్పనకు, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే నీటిపారుదల పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా సిఫార్సు చేసింది.

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పాటింపునకు, నిధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ధ్రువీకరించేందుకు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థల ద్వారా తీసుకున్న బడ్జెటేతర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో వెల్లడించాల్సిన అవసరం ఉందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది.


తలసరి అప్పు రూ. 92,779

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అప్పుల లెక్కల ప్రకారం 2022 మార్చి నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.92,797 రుణభారం ఉందని కాగ్‌ తేల్చి చెప్పింది. 2021-22 చివరి నాటికి మొత్తం అప్పులు అధికారిక లెక్కల ప్రకారం రూ.3,72,503 కోట్లుగా పేర్కొంది. వీటికి బడ్జెటేతర అధికారిక రుణాలు రూ.1,18,393 కోట్లను జత చేసింది. బడ్జెటేతర రుణాలు కలపి పరిగణించకపోతే తలసరి అప్పు రూ.70,416గాను, వాటిని కూడా కలిపితే రూ.92,797గాను ఉంటుందని లెక్కించింది. వివిధ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకుంటున్నా చట్ట ప్రకారం వాటిని ఆడిట్‌ చేసి ఆ నివేదికలను సమర్పించడం లేదని కాగ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని