రాష్ట్రంలో రుణ విస్ఫోటం!
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులు, రెవెన్యూ పద్దుల్లో లోటును భర్తీ చేసేందుకు వినియోగించడం వల్ల రాష్ట్రం సేకరించిన రుణాల ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోంది.
అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశం కొట్టి పడేయలేం
అభివృద్ధికి చేసే వ్యయం తక్కువే
కాగ్ తీవ్ర వ్యాఖ్యలు
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులు, రెవెన్యూ పద్దుల్లో లోటును భర్తీ చేసేందుకు వినియోగించడం వల్ల రాష్ట్రం సేకరించిన రుణాల ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోంది. బడ్జెట్‌లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణిస్తే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోంది. రానున్న సంవత్సరాల్లో రుణాలను భరించే సామర్థ్యం ఉండే అవకాశం లేదు’ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎండగట్టింది. ‘రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) రుణ నిష్పత్తి 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య పెరుగుదల సరళిని నమోదు చేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక వాహక నౌకల (స్పెషల్ పర్పస్ వెహికల్) ద్వారా తీసుకున్న రుణాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 మార్చి 31 నాటికి జీఎస్‌డీపీలో రుణాల శాతం 31శాతమే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నా నిజానికి రాష్ట్ర రుణాల భారం అంతకుమించి ఉంది. బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో రుణాల శాతం 42.33గా ఉంది. ఇది నిర్దేశించిన పరిమితి కన్నా 6.73శాతం అదనంగా ఉంది’ అని కాగ్ స్పష్టీకరించింది.
ఈ రుణభారాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతో పాటు రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉంది’ అని కాగ్ కుండబద్దలు కొట్టింది.
అంటే చేసిన అప్పులు తీర్చుకునేందుకు రాబడి పెంచుకోకుంటే అభివృద్ధి శూన్యమయ్యే పరిస్థితి ఉంటుందని విశ్లేషించింది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా చూస్తే.. 2021-22 నుంచి ప్రారంభిస్తే 2030-31నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,47,944.64 కోట్లు వడ్డీలు, అసలు కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 2024-25లో రుణాలు తిరిగి చెల్లించే బాధ్యత పతాక స్థాయికి చేరనుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.42,362.20 కోట్ల రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రుణ బాధ్యత సరళి కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నా ఆదాయాలు పెంచుకోకుండా ఖర్చుల కోసం బహిరంగ మార్కెట్ రుణాలు, ఇతర అప్పులపై ఆధారపడితే రుణ భారం మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.
అప్పుల వలయంలో చిక్కుకునే ప్రమాదం..!
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం ఈ అప్పులు చేయడంలేదని కాగ్ నివేదిక పేర్కొంది. ‘‘2017-18 నుంచి 2021-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆ సొమ్ముతో పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తోంది. కొత్త అప్పుల్లో 65 నుంచి 83 శాతం మొత్తాన్ని పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తున్నారు. ఈ అప్పులు మూలధన ఆస్తుల సృష్టికి (అభివృద్ధికి) కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు ఆ సరళి తెలియజేస్తోంది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించ కుండా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి, ప్రభుత్వ రుణం భరించలేనిదిగా మారి, రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపడేయలేము’ అని కాగ్ హెచ్చరించింది.
అభివృద్ధి పనులపై వ్యయం తక్కువే!
రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే మూలధన వ్యయం వాటా తక్కువగా ఉంటోంది. సాధారణంగా అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం వ్యయంలో సగటున 14.41శాతం అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం మూలధన వ్యయం(అభివృద్ధి పనులు) కోసం 9.21శాతమే ఖర్చు చేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువగా ఉంది. ఇది రాష్ట్రంలో భౌతిక ఆస్తుల కల్పనను ప్రభావితం చేస్తూ దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కాగ్ నివేదిక పేర్కొంది.
బడ్జెట్‌లో ఎన్నో భారాలు చూపడం లేదు!
‘గత సంవత్సరంతో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు 6.97శాతం మేర పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో భారాలను బడ్జెట్‌లో చూపడం లేదు. బడ్జెటేతర రుణాల రూపేణా రూ.1,18,394 కోట్లు, 2021-22 సంవత్సరానికి డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు, నీటిపారుదల ప్రాజెక్టులకు, నీటి సరఫరా పథకాలకు చెల్లించవలసిన తప్పనిసరి బకాయిలు రూ.17,804.20 కోట్ల మేర ఉన్నాయి. వీటిని బడ్జెట్‌లో భాగంగా చూపడం లేదు. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను, శాసనసభ పర్యవేక్షణ పాత్రను నిర్వీర్యం చేయడమే కాకుండా కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పథకాలకు నిధుల కేటాయింపుపై శాసనసభ నియంత్రణ దాటిపోయేలా ప్రభావం చూపుతుంది’ అని కాగ్ విశ్లేషించింది.
అప్పులు రహస్యమే...
అప్పుల వినియోగానికి సరైన విధివిధానాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని కాగ్ సూచించింది. ‘రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటేతర రుణాలను బడ్జెట్‌లో వెల్లడించడం లేదు. ఆ రుణాలను పరిగణనలోకి తీసుకుంటే 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.4,90,897 కోట్లు. ఈ మొత్తం జీఎస్‌డీపీలో 40.85శాతం’ అని కాగ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం 30 కార్పొరేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే బడ్జెటేతర రుణాల నికర పెరుగుదల రూ.6,278.91 కోట్లుగా ఉందని కాగ్ తేల్చింది. బడ్జెటేతర రుణాల వల్ల నికర రుణాల గరిష్ఠ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం అధిగమించే ప్రమాదముందని, ఆ రుణాలు రెవెన్యూ, ద్రవ్యలోటును ప్రభావితం చేసి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలను అతిక్రమించే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది.
ప్రభుత్వం చెప్పేది ఆమోదయోగ్యంగా లేదు
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తన బకాయిలను వెల్లడించినట్లుగా ప్రభుత్వం పేర్కొంటోందని, నిజానికి ప్రభుత్వ సమాధానం ఆమోదయోగ్యంగా లేదని కాగ్ కుండబద్దలు కొట్టింది. ‘ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం మొత్తం బకాయిలు రాష్ట్ర సంచిత నిధి, పబ్లిక్ అకౌంట్‌లోని బకాయిలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్‌పీవీలు, ఇతర సాధనాల ద్వారా తీసుకున్న రుణాలు రాష్ట్ర బడ్జెట్ నుంచి అసలు లేదా వడ్డీని చెల్లించే హామీలతో సహా అన్నీ అందులో స్పష్టంగా నిర్వచించినందున రాష్ట్ర ప్రభుత్వం అన్ని బకాయిలను వెల్లడిస్తున్నామని చెబుతున్న సమాధానం ఆమోదయోగ్యం కాదు’ అని కాగ్ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్