పాన్‌ మసాలా, గుట్కా వ్యాపారులకు ఊరట

గుట్కా, పాన్‌ మసాలా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీ, విక్రయదారులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫుడ్‌సేఫ్టీ, స్టాండర్డ్‌ చట్టం-2006 ప్రకారం గుట్కా, పాన్‌మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు ‘ఆహారం’ అనే నిర్వచనం కిందికి రావని తేల్చిచెప్పింది.

Published : 25 Mar 2023 06:24 IST

ఆ ఉత్పత్తులు ‘ఆహారం’ నిర్వచనం కిందికి రావు
హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: గుట్కా, పాన్‌ మసాలా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీ, విక్రయదారులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫుడ్‌సేఫ్టీ, స్టాండర్డ్‌ చట్టం-2006 ప్రకారం గుట్కా, పాన్‌మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు ‘ఆహారం’ అనే నిర్వచనం కిందికి రావని తేల్చిచెప్పింది. గుట్కా, పాన్‌ మసాలా పొగాకు ఉత్పత్తుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ ఆహార భద్రత కమిషనర్‌కు లేదని స్పష్టం చేసింది. ఆ వ్యాపారాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చే అధికారం కమిషనర్‌కు ఉండదని తేల్చిచెప్పింది. పొగాకు ఉత్పత్తుల విషయంలో పిటిషనర్లు చట్టబద్ధంగా నిర్వహిస్తున్న రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో అధికారులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదంది. ఏపీ ఆహార భద్రత కమిషనర్‌ 2021 డిసెంబరు 6న జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా పొగాకు ఉత్పత్తులను సీజ్‌ చేసి ఉంటే, వాటిని తక్షణం విడుదల చేయాలని పేర్కొంది. లైసెన్సు తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు తీర్పునిచ్చింది. గుట్కా, పాన్‌మసాలా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయాలను నిలువరిస్తూ ఆహార భద్రత రాష్ట్ర కమిషనర్‌ 2020 జనవరి 8, 2021 డిసెంబరు 6న జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ వ్యాపార సంస్థల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కమిషనర్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. సురక్షితం కాని ఆహార ఉత్పత్తులను నిషేధించే అధికారం ఫుడ్‌సేఫ్టీ, స్టాండర్డ్‌ చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న ఏజీ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని