కోర్టు ఆదేశాలంటే అంత నిర్లక్ష్యమా

కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

Published : 25 Mar 2023 03:26 IST

సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  గైర్హాజరుపై హైకోర్టు ఆగ్రహం
నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌  జారీకి సిద్ధపడిన ధర్మాసనం
జీతం కోసం యాచించాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒక దశలో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసేందుకు సిద్ధపడింది. ‘పిటిషనర్‌కు జీతం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలిస్తే పట్టించుకోరా. కోర్టు ఉత్తర్వులంటే అంత నిర్లక్ష్యమా? జీతం చెల్లించండి అని మిమ్మల్ని యాచించాలా? 2018 నుంచి జీతం చెల్లించకుండా పిటిషనర్‌తో పని చేయించుకుంటున్నారా? కోర్టు ఆదేశించినా జీతం చెల్లించకపోవడానికి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, అకౌంటెంట్‌ జనరల్‌ ఎవరు? వారినీ కోర్టుకు పిలిపిస్తాం. రాజ్యాంగబద్ధ కోర్టు కంటే వారిద్దరు ఎక్కువ అని భావిస్తున్నారా? కోర్టుకు రాలేనప్పుడు సకాలంలో అనుమతి పిటిషన్‌ దాఖలు చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌కు తెలీదా?’ అని తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. శాసనసభ సమావేశాలకు హాజరుకావాల్సి ఉండటంతో పూనం మాలకొండయ్య విచారణకు రాలేకపోయారన్నారు. ఎన్బీడబ్ల్యూ ఇవ్వొద్దని పదేపదే బతిమాలారు. తదుపరి విచారణకు హాజరవుతారని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. ఆ రోజు వైద్యారోగ్యశాఖ పూర్వ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య పూర్వ డైరెక్టర్‌/డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉపకులపతి కె.బాబ్జీ, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్‌ టి.మురళీమోహన్‌ హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.గంగారావు, జస్టిస్‌ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. విజయవాడ దంత వైద్యకళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తనకు హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ కొన్నేళ్లుగా జీతం చెల్లించకపోవడం లేదని టి.సుజాత 2018లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 24న విచారించిన ధర్మాసనం.. వైద్యారోగ్యశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య పూర్వ డైరెక్టర్‌ కె.బాబ్జీ, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్‌ టి.మురళీమోహన్‌ హాజరుకు ఆదేశించింది. శుక్రవారం జరిగిన విచారణకు మురళీమోహన్‌ మాత్రమే విచారణకు హాజరయ్యారు. మిగిలిన వారు రాకపోవడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు