ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు

రాష్ట్రంలో నదీ తీరాల్లో ఇసుక తవ్వకాలు నిలిపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషనర్‌ దండా నాగేంద్రకుమార్‌ ఆరోపించారు.

Published : 25 Mar 2023 03:26 IST

పెదకూరపాడు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని పిటిషనర్‌ నాగేంద్రకుమార్‌ వెల్లడి

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే, పట్టాభిపురం: రాష్ట్రంలో నదీ తీరాల్లో ఇసుక తవ్వకాలు నిలిపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషనర్‌ దండా నాగేంద్రకుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఇష్టానుసారం చేస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన నాగేంద్రకుమార్‌ గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో తవ్వకాలు ఆపాలని ఇటీవల ఎన్జీటీ తీర్పునిచ్చిందని పిటిషనర్‌ వివరించారు. వివరాలను శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాకు వెల్లడించారు. జేపీ వెంచర్స్‌ ఇసుక తవ్వకాలు చేస్తున్నప్పుడు వైకాపాకు చెందిన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు తనతో పిటీషన్‌ వేయించారని గుర్తు చేశారు. ఆ తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకరరావుతోపాటు ఆయన కుటుంబీకులు ఒత్తిడి తెచ్చారని.. అయినా తాను వెనక్కు తగ్గలేదని చెప్పారు. దీంతో తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడంతోపాటు చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు తానే గుంటూరు జిల్లావ్యాప్తంగా తవ్వకాలు చేస్తుండడంతో ఎన్జీటీలో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు’ అని ఆరోపించారు. గతంలో జేపీ వెంచర్స్‌ ప్రతినిధులను ఎమ్మెల్యే బెదిరించిన వీడియోకాల్‌ను నాగేంద్రకుమార్‌ బయటపెట్టారు. ఇప్పటికైనా తీర్పును అమలు చేయకపోతే మరోసారి ఎన్జీటీని ఆశ్రయిస్తానన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని